Shubman Gill Records: ఒక్క డబుల్ సెంచరీ.. ఎన్నో రికార్డులు.. గిల్ సాధించిన ఘనతలు ఇవే
Shubman Gill Records: ఒక్క డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు శుభ్‌మన్ గిల్. వీటిలో మాస్టర్ బ్లాస్టర్ హైదరాబాద్ లోనే సాధించిన రికార్డును కూడా అతడు బ్రేక్ చేయడం విశేషం.
Shubman Gill Records: భాగ్యనగరంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలుసు కదా. అతడు వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ మధ్యే శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో సెంచరీ చేసిన గిల్.. ఈసారి ఆ సెంచరీని డబుల్ గా మలిచాడు. కేవలం 145 బంతుల్లోనే అతడు ఈ డబుల్ సెంచరీ చేయడం విశేషం.
చివరికి 149 బంతుల్లో 208 రన్స్ చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 9 సిక్స్ లు ఉన్నాయి. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో గిల్ కొన్ని రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ బ్యాటర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అతడు 23 ఏళ్ల 132 రోజుల వయసులో ఈ ఘనత అందుకున్నాడు. ఈ మధ్యే ఇషాన్ కిషన్ నమోదు చేసిన రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇషాన్ బంగ్లాదేశ్ పై 24 ఏళ్ల 145 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు. వీళ్ల కంటే ముందు రోహిత్ శర్మ 2013లో ఆస్ట్రేలియాపై 26 ఏళ్ల 186 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్ పై అత్యధిక స్కోరు
న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్ గా కూడా శుభ్‌మన్ గిల్ నిలవడం విశేషం. ఈ క్రమంలో అతడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 24 ఏళ్ల కిందట ఇదే హైదరాబాద్ లో న్యూజిలాండ్ పై 186 రన్స్ చేశాడు. ఇన్నాళ్లూ కివీస్ పై ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. మాస్టర్ ఆ ఇన్నింగ్స్ ఎల్బీ స్టేడియంలో ఆడాడు. ఇప్పుడా రికార్డు గిల్ పేరిట చేరింది. శుభ్‌మన్ గిల్ 208 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
వన్డేల్లో వేగంగా 1000 రన్స్
ఇక ఈ ఇన్నింగ్స్ ద్వారానే వన్డేల్లో వేగంగా 1000 రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్ గా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. గిల్ 19 ఇన్నింగ్స్ లోనే ఈ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ కోహ్లి, ధావన్ పేరిట సంయుక్తంగా 24 ఇన్నింగ్స్ తో ఉన్న రికార్డు బ్రేకయింది. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ 18 ఇన్నింగ్స్ లోనే 1000 రన్స్ చేశాడు.