India vs New Zealand 1st ODI: బ్రేస్‌వెల్ తుఫాన్‌ను అడ్డుకున్న ఇండియా.. తొలి వన్డేలో విజయం-india vs new zealand 1st odi bracewell smashes century but siraj and shardul help india win ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs New Zealand 1st Odi: బ్రేస్‌వెల్ తుఫాన్‌ను అడ్డుకున్న ఇండియా.. తొలి వన్డేలో విజయం

India vs New Zealand 1st ODI: బ్రేస్‌వెల్ తుఫాన్‌ను అడ్డుకున్న ఇండియా.. తొలి వన్డేలో విజయం

Hari Prasad S HT Telugu
Jan 18, 2023 09:59 PM IST

India vs New Zealand 1st ODI: బ్రేస్‌వెల్ తుఫాన్‌ను అడ్డుకుంది ఇండియా. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

బ్రేస్‌వెల్ తుఫాన్‌ను అడ్డుకొని విజయం సాధించిన ఇండియా
బ్రేస్‌వెల్ తుఫాన్‌ను అడ్డుకొని విజయం సాధించిన ఇండియా (AFP)

India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ చుక్కలు చూపించాడు. అసలు ఆశలే లేని న్యూజిలాండ్ టీమ్ ను ఏకంగా 350 టార్గెట్ చేజ్ చేసే దిశగా తీసుకెళ్లాడు. అయితే చివరి ఓవర్లో చివరి వికెట్ గా వెనుదిరగడంతో ఇండియా 12 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. బ్రేస్‌వెల్ 78 బంతుల్లోనే 140 రన్స్ చేశాడు.

అతని తుఫాను ఇన్నింగ్స్ లో ఏకంగా 12 ఫోర్లు, 10 సిక్స్ లు ఉన్నాయి. 350 రన్స్ చేజింగ్ లో ఒక దశలో 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి న్యూజిలాండ్ గెలవడం పక్కా అనుకునేలా చేశాడు బ్రేస్‌వెల్. సాంట్నర్ తో కలిసి ఏడో వికెట్ కు 162 రన్స్ జోడించి టీమిండియా వెన్నులో వణుకు పుట్టించాడు. చివరి విజయానికి 20 పరగులు అవసరం కాగా.. తొలి బంతికే సిక్స్ కొట్టాడు.

అయితే ఆ ఓవర్ వేసిన శార్దూల్.. రెండో బంతికి యార్కర్ తో బ్రేస్‌వెల్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. లోకల్ బాయ్ సిరాజ్ 4 వికెట్లతో న్యూజిలాండ్ ఓటమిలో కీలకపాత్ర పోషించాడు. ఇక కీలకమైన సమయంలో హార్దిక్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుల్దీప్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు.

శుభ్‌మన్.. తుఫాన్

అంతకుముందు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. శ్రీలంకతో చివరి వన్డేలో సెంచరీ బాదిన అతడు.. ఇప్పుడు న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. అతడు కేవలం 145 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓవైపు సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేరుతుంటే.. గిల్ మాత్రమే చివరి వరకూ క్రీజులో నిలిచి టీమ్ కు భారీ స్కోరు సాధించి పెట్టాడు.

గిల్ దూకుడుతో ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 రన్స్ చేసింది. గిల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. అతడు 149 బంతుల్లో 208 రన్స్ చేయడం విశేషం. గిల్ ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు, 19 ఫోర్లు ఉన్నాయి. చివరి మూడు ఓవర్లలోనే అతడు ఏకంగా ఆరు సిక్స్ లు బాదడం విశేషం. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) విఫలమవగా.. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ (31), హార్దిక్ (28) ఫర్వాలేదనిపించారు.

ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. గిల్ వన్డేల్లో 19వ ఇన్నింగ్స్ లోనే 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో అతడు 106 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు గిల్ 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు.

ఇప్పటి వరకూ వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన ఇండియన్స్ గా ఉన్న విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ల రికార్డును గిల్ బ్రేక్ చేశారు. కోహ్లి, ధావన్ 24 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు చేశారు. వాళ్ల కంటే ఐదు ఇన్నింగ్స్ ముందుగానే గిల్ ఆ మైల్ స్టోన్ అందుకున్నాడు. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఇంజమాముల్ హక్ కూడా వన్డేల్లో 19 ఇన్నింగ్స్ లోనే 1000 రన్స్ పూర్తి చేశాడు.

ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ కు చెందిన ఫఖర్ జమాన్ పేరిట ఉంది. అతడు 18 ఇన్నింగ్స్ లోనే ఈ మార్క్ అందుకున్నాడు. ఇంతకుముందు వన్డేల్లో అత్యంత వేగంగా 500 రన్స్ అందుకున్న ఇండియన్ బ్యాటర్ గా కూడా గిల్ నిలిచాడు. పది ఇన్నింగ్స్ లో 500 రన్స్ చేసిన గిల్.. ఆ తర్వాత 9 ఇన్నింగ్స్ లోనే మరో 500 మార్క్ దాటేశాడు.