Shubman Gill Record: ఉప్పల్‌లో శుభ్‌మన్ గిల్ సునామీ.. డబుల్ సెంచరీతో వన్డేల్లో అరుదైన రికార్డు
Shubman Gill Record: ఉప్పల్‌లో శుభ్‌మన్ గిల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. 145 బంతుల్లోనే అతడు డబుల్ సెంచరీ చేయడం విశేషం. అంతేకాదు వన్డేల్లో ఇది వరుసగా రెండో సెంచరీ. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు బ్యాటర్ గా గిల్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
Shubman Gill Record: ఉప్పల్‌లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెలరేగిపోయాడు. శ్రీలంకతో చివరి వన్డేలో సెంచరీ బాదిన అతడు.. ఇప్పుడు న్యూజిలాండ్ పై ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. అతడు కేవలం 145 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్ గా నిలిచాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఓవైపు సహచరులంతా ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేరుతుంటే.. గిల్ మాత్రమే చివరి వరకూ క్రీజులో నిలిచి టీమ్ కు భారీ స్కోరు సాధించి పెట్టాడు.
గిల్ దూకుడుతో ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 రన్స్ చేసింది. గిల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. అతడు 149 బంతుల్లో 208 రన్స్ చేయడం విశేషం. గిల్ ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు, 19 ఫోర్లు ఉన్నాయి. చివరి మూడు ఓవర్లలోనే అతడు ఏకంగా ఆరు సిక్స్ లు బాదడం విశేషం. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) విఫలమవగా.. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ (31), హార్దిక్ (28) ఫర్వాలేదనిపించారు.
ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును కూడా తన పేరిట రాసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ గా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. గిల్ వన్డేల్లో 19వ ఇన్నింగ్స్ లోనే 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో అతడు 106 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు గిల్ 1000 రన్స్ పూర్తి చేసుకున్నాడు.
ఇప్పటి వరకూ వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి రన్స్ చేసిన ఇండియన్స్ గా ఉన్న విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్ ల రికార్డును గిల్ బ్రేక్ చేశారు. కోహ్లి, ధావన్ 24 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు చేశారు. వాళ్ల కంటే ఐదు ఇన్నింగ్స్ ముందుగానే గిల్ ఆ మైల్ స్టోన్ అందుకున్నాడు. గతంలో పాకిస్థాన్ బ్యాటర్ ఇంజమాముల్ హక్ కూడా వన్డేల్లో 19 ఇన్నింగ్స్ లోనే 1000 రన్స్ పూర్తి చేశాడు.
ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ కు చెందిన ఫఖర్ జమాన్ పేరిట ఉంది. అతడు 18 ఇన్నింగ్స్ లోనే ఈ మార్క్ అందుకున్నాడు. ఇంతకుముందు వన్డేల్లో అత్యంత వేగంగా 500 రన్స్ అందుకున్న ఇండియన్ బ్యాటర్ గా కూడా గిల్ నిలిచాడు. పది ఇన్నింగ్స్ లో 500 రన్స్ చేసిన గిల్.. ఆ తర్వాత 9 ఇన్నింగ్స్ లోనే మరో 500 మార్క్ దాటేశాడు.