Cricket | ఫీల్డ్‌లో 30 గజాల సర్కిల్‌ ఎందుకు ఉంటుంది? దీని ప్రాముఖ్యత ఏంటి?-what is the importance of 30 yard circle in cricket field ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  What Is The Importance Of 30 Yard Circle In Cricket Field

Cricket | ఫీల్డ్‌లో 30 గజాల సర్కిల్‌ ఎందుకు ఉంటుంది? దీని ప్రాముఖ్యత ఏంటి?

Hari Prasad S HT Telugu
Dec 20, 2021 02:40 PM IST

ఈ లైన్‌ ఫీల్డ్‌ను ఇన్‌ఫీల్డ్‌, ఔట్‌ఫీల్డ్‌ అంటూ రెండుగా విభజిస్తుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ 30 గజాల సర్కిల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఈ సర్కిల్‌ ఎందుకు? క్రికెట్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది?

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ 30 గజాల సర్కిల్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ 30 గజాల సర్కిల్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది (HT File Photo)

Cricket.. క్రికెట్‌ ఫీల్డ్‌లో 30 గజాల సర్కిల్‌ను మీరు చూసే ఉంటారు. ఈ లైన్‌ ఫీల్డ్‌ను ఇన్‌ఫీల్డ్‌, ఔట్‌ఫీల్డ్‌ అంటూ రెండుగా విభజిస్తుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ 30 గజాల సర్కిల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఈ సర్కిల్‌ ఎందుకు? క్రికెట్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది? ఇది క్రికెట్‌లో ఎలాంటి విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందన్న ఆసక్తికర విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

30 గజాల సర్కిల్‌ ఎప్పుడొచ్చింది?

ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు క్రికెట్‌కు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. కానీ 30 గజాల సర్కిల్‌ మొదటి నుంచీ లేదు. 1980ల్లో ఆస్ట్రేలియాలో తొలిసారి ఈ 30 గజాల సర్కిల్‌ను క్రికెట్‌ ఫీల్డ్‌లో పరిచయం చేశారు. పిచ్‌పై మిడిల్‌ స్టంప్ నుంచి రెండు వైపులా సరిగ్గా 30 గజాల మేర ఓ గీత గీసి ఫీల్డ్‌ను విభజించారు. ఈ గీతే ఆ తర్వాతి కాలంలో ఆధునిక క్రికెట్‌ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేసి, ఓ విప్లవాత్మక మార్పుకు కారణమైంది.

వేగం పెరిగింది

ఈ 30 గజాల సర్కిల్‌ వచ్చిన తర్వాత క్రికెట్‌లో వేగం పెరిగింది. దీనికి కారణం ఫీల్డింగ్‌ నిబంధనలే. అంతకుముందు వరకూ పరుగులను నియంత్రించడానికి ఫీల్డర్లంతా బౌండరీల దగ్గర ఉండేవాళ్లు. కానీ ఈ సర్కిల్‌ వచ్చిన తర్వాత దీని వెలుపల ఉండాల్సిన ఫీల్డర్ల సంఖ్యపై పరిమితి ప్రారంభమైంది. ఇది బ్యాట్స్‌మెన్‌ పాలిట వరంగా మారింది. బౌండరీలు బాదడానికి గ్యాప్స్‌ ఎక్కువగా దొరికాయి. బ్యాట్స్‌మెన్‌ ధైర్యంగా షాట్లు ఆడటం ప్రారంభించారు. ఈ సర్కిల్‌ వచ్చిన తర్వాతే ఫీల్డింగ్‌ నిబంధనలు వచ్చాయి. వన్డేల్లో పరుగుల వరద పారడం అప్పుడే ప్రారంభమైంది.

పవర్‌ప్లేకు, ఈ సర్కిల్‌కు లింకేంటి?

ఈ ఫీల్డింగ్‌ నిబంధనలకే తర్వాత పవర్‌ ప్లే అనే పేరు పెట్టారు. వన్డేల్లో మొదట్లో ఇన్నింగ్స్‌ తొలి 15 ఓవర్లను పవర్‌ప్లేగా పిలిచేవాళ్లు. ఈ సమయంలో ఈ సర్కిల్‌ బయట కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉండటంతో.. ఆ 15 ఓవర్లలో పరుగుల వరద పారడం మొదలైంది. జయసూర్య, అఫ్రిది, గిల్‌క్రిస్ట్‌లాంటి పవర్‌ హిట్టర్లు ఈ ఫీల్డింగ్‌ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని వన్డే క్రికెట్‌ ఆడే విధానాన్నే మార్చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పటి వరకూ వన్డేల్లో సగటున ఓవర్‌కు 4 పరుగులు వస్తే.. ఈ పవర్‌ ప్లే వల్ల అది కాస్తా 6కు పెరగడం విశేషం.

వన్డే, టీ20ల్లో పవర్‌ప్లే

ఆ తర్వాత ఈ పవర్‌ ప్లే నిబంధనల్లోనూ మార్పులు వచ్చాయి. కొన్నాళ్లు బ్యాటింగ్‌ టీమ్‌ తమకు పవర్‌ ప్లే ఎప్పుడు కావాలో ఎంచుకునే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌ను మొత్తం మూడు పవర్‌ప్లేలుగా విభజించారు. తొలి పది ఓవర్లలో కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్‌ బయట అంటే ఔట్‌ఫీల్డ్‌లో ఉండాలి. ఆ తర్వాత 11 నుంచి 40వ ఓవర్‌ వరకూ గరిష్ఠంగా నలుగురు ఫీల్డర్లు, ఇక చివరి 10 ఓవర్లలో గరిష్ఠంగా ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్‌ బయట ఉండాలన్న నిబంధన ఉంది. ఇక టీ20ల్లో అయితే తొలి ఆరు ఓవర్లలో కేవలం ఇద్దరు ఫీల్డర్లే ఈ 30 గజాల సర్కిల్‌ బయట ఉండాలి. ఆ తర్వాత 14 ఓవర్లు గరిష్ఠంగా ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఔట్‌ఫీల్డ్‌లో ఉండాలి.

టెస్టుల్లో 30 గజాల సర్కిల్‌ ఉంటుందా?

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పెను మార్పులకు కారణమైన ఈ 30 గజాల సర్కిల్‌కు.. సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఈ ఫార్మాట్‌లో ఫీల్డింగ్‌ నిబంధనలు ఏమీ ఉండవు. దాదాపు ఏ సమయంలో అయినా ఎక్కడైనా ఫీల్డర్లను మోహరించుకోవచ్చు. అయితే లెగ్‌సైడ్‌లో స్వ్కేర్‌ వెనుకాల ఇద్దరు ఫీల్డర్ల కంటే ఎక్కువ ఉండకూడదన్న నిబంధన మాత్రం ఉంటుంది. నిజానికి ఇది అన్ని ఫార్మాట్లకూ వర్తిస్తుంది. బౌలర్లు బాడీలైన్‌ బౌలింగ్‌ చేయకుండా నియంత్రించేందుకే ఈ నిబంధన తీసుకొచ్చారు. ఈ రూల్‌ లేకపోతే బౌలర్ల తరచూ స్వ్కేర్‌లోనే ఫీల్డర్లందరినీ మోహరించి.. బ్యాటర్ల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బంతులు విసిరే ప్రమాదం ఉంటుంది.

మహిళల క్రికెట్లో 30 గజాల సర్కిల్‌

మహిళల క్రికెట్‌లోనూ ఈ సర్కిల్‌ ఉంటుంది. అయితే మెన్స్‌ క్రికెట్‌లో ఇది 30 గజాలు ఉండగా.. వుమెన్స్‌ క్రికెట్‌లో మాత్రం ఐదు గజాలు చిన్నగా ఉంటుంది. ఫీల్డింగ్‌ నిబంధనలు మాత్రమే అలాగే ఉంటాయి. పవర్‌ప్లేలో సర్కిల్‌ బయట కేవలం ఇద్దరు ఫీల్డర్లు, మిగతా సమయంలో గరిష్ఠంగా ఐదుగురు ఫీల్డర్లు ఉండొచ్చు.

ఈ ఫీల్డింగ్‌ నిబంధనలు పాటించకపోతే..

ఈ ఇన్‌ఫీల్డ్‌, ఔట్‌ఫీల్డ్ ఫీల్డింగ్ నిబంధనలను టీమ్స్‌ కచ్చితంగా పాటించాల్సిందే. అన్ని టీమ్స్‌ ఈ నిబంధనలు పాటిస్తున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత అంపైర్లదే. ఒకవేళ ఏ టీమ్‌ అయినా ఫీల్డింగ్‌ నిబంధన ఉల్లంఘిస్తే బౌలర్‌ వేసే ఆ బాల్‌ను నోబాల్‌గా ప్రకటించే అధికారం అంపైర్‌కు ఉంటుంది. ఒకవిధంగా ఈ ఫీల్డింగ్‌ నిబంధనలు కెప్టెన్లకు అగ్నిపరీక్షలాంటివే. ముఖ్యంగా ఛేజింగ్‌ సమయాల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి ఈ నిబంధనలు పాటిస్తూ ఫీల్డర్లను మోహరించడం అంత సులువు కాదు.

WhatsApp channel

సంబంధిత కథనం