Steve Smith on Ind vs Aus: కావాలనే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదు.. ఆస్ట్రేలియా సీక్రెట్ బయటపెట్టిన స్టీవ్ స్మిత్
31 January 2023, 12:17 IST
- Steve Smith on Ind vs Aus: కావాలనే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదంటూ ఆస్ట్రేలియా టీమ్ సీక్రెట్ బయటపెట్టాడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. టూర్ మ్యాచ్ ఆడకపోవడం వెనుక బీసీసీఐయే కారణమని కూడా అతడు చెప్పడం విశేషం.
స్టీవ్ స్మిత్
Steve Smith on Ind vs Aus: ఇండియాలో సిరీస్ అంటే ఆస్ట్రేలియాకు ఎప్పుడూ సవాలే. అలాంటిది ఈసారి నాలుగు టెస్టుల సిరీస్ కు ముందు ఆ టీమ్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా నేరుగా బరిలోకి దిగుతోంది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
ఇప్పుడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా తాము ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదో వివరించాడు. నిజానికి దీని వెనుక కారణం బీసీసీఐయే అని అతడు చెప్పడం విశేషం. "మేము చివరిసారి వచ్చినప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ ల కోసం పచ్చిక ఉన్న పిచ్ ఏర్పాటు చేశారు. నిజానికి ఆ పిచ్ ఇవ్వాల్సింది కాదు. అందుకే మా సొంతంగా నెట్స్ లో ప్రాక్టీస్ చేసి, స్పిన్నర్లతో ఎక్కువగా బౌలింగ్ చేయించుకుంటాం. ఇక అసలు మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి. కానీ టూర్ మ్యాచ్ ఆడకూడదని మేము సరైన నిర్ణయమే తీసుకున్నాం" అని స్మిత్ చెప్పాడు.
అటు ఆస్ట్రేలియా కోచ్ మెక్‌డొనాల్డ్ కూడా తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఆస్ట్రేలియాలోనే దుమ్ము లేచే పిచ్ లను తయారు చేయించుకొని ప్రాక్టీస్ చేశామని, గతంలో పాకిస్థాన్ టూర్ వెళ్లే ముందు కూడా అలాగే చేసినట్లు చెప్పాడు. అయితే మైకేల్ క్లార్క్ లాంటి పలువురు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మాత్రం ఇలా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఇప్పుడు ఇండియా టూర్ వచ్చే ముందు కూడా సిడ్నీలో ఇండియాను పోలిన పొడి, పగుళ్లు ఉన్న పిచ్ లను తయారు చేయించి ప్రాక్టీస్ చేశారు. తొలి మ్యాచ్ కు వారం రోజుల ముందు ఇండియాలో ప్రాక్టీస్ మొదలుపెట్టడం సరిపోతుందని కూడా ఈ సందర్భంగా స్మిత్ చెప్పాడు. ఇండియా టూర్ కీలకమే అయినా.. అదే అంతిమ లక్ష్యం కాదని కూడా అతడు స్పష్టం చేశాడు.
"ఈ సిరీస్ చాలా పెద్దది. కానీ ఇదే అంతిమ లక్ష్యం మాత్రం కాదని అనుకుంటున్నా. వచ్చే ఆరు నెలల్లో ఇండియా, ఇంగ్లండ్ టూర్లు అంటే ఓ ఆస్ట్రేలియన్ టెస్ట్ క్రికెటర్ గా నాకు చాలా పెద్దవి. మా ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇండియాకు గతంలో రెండుసార్లు వెళ్లినా నేను సిరీస్ గెలవలేకపోయాను. అక్కడ ఆడటం చాలా కష్టం" అని స్మిత్ చెప్పాడు.
అయితే కిందటిసారి ఇండియాకు వచ్చినప్పుడు స్మిత్ బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. 71 సగటుతో 499 రన్స్ చేయడంతోపాటు మూడు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి గతేడాది నుంచి అతడు మళ్లీ గాడిలో పడ్డాడు. ఇప్పుడు ఇండియాకు వచ్చే ముందు అన్ని ఫార్మాట్లలో కలిపి స్మిత్ తన చివరి 16 ఇన్నింగ్స్ లో 85 సగటుతో 1027 రన్స్ చేయడం విశేషం.