తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Siraj As Bumrah Replacement: బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ టీమ్‌లోకి రానున్నాడా?

Siraj as Bumrah Replacement: బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ టీమ్‌లోకి రానున్నాడా?

Hari Prasad S HT Telugu

29 September 2022, 22:18 IST

google News
    • Siraj as Bumrah Replacement: బుమ్రా స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ టీమ్‌లోకి రానున్నాడా? ఇప్పుడిదే చర్చ మొదలైంది. వెన్ను గాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన విషయం తెలిసిందే.
మహ్మద్ సిరాజ్
మహ్మద్ సిరాజ్ (AFP)

మహ్మద్ సిరాజ్

Siraj as Bumrah Replacement: టీ20 వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలిన విషయం తెలుసు కదా. ఈ మెగా టోర్నీకి స్టార్‌ బౌలర్‌ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. అతడు ఈ టోర్నీలో ఆడబోవడం లేదని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించారు.

దీంతో ఇప్పుడు బుమ్రా స్థానంలో టీమ్‌లోకి ఎవరు వస్తారు అన్న చర్చ మొదలైంది. టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా ఇప్పటికే 15 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది. అందులో బుమ్రాతోపాటు భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌ పేస్‌ బౌలర్లుగా ఉన్నారు. వీళ్లు కాకుండా మరో నలుగురిని రిజర్వ్‌ సభ్యులుగా ఉంచగా.. అందులోనూ ఇద్దరు పేసర్లు ఉన్నారు.

బుమ్రా స్థానంలో సిరాజ్‌ వస్తాడా?

వరల్డ్‌కప్‌ కోసం ఎంపిక చేసిన రిజర్వ్‌ ప్లేయర్స్‌లో స్టార్‌ పేస్‌బౌలర్‌ మహ్మద్‌ షమి, యువ పేసర్‌ దీపక్‌ చహర్‌ ఉన్నారు. ఇప్పుడు బుమ్రా గాయపడటంతో ఈ ఇద్దరిలో 15 మంది టీమ్‌లోకి ఎవరు వస్తారు అన్న చర్చ జరుగుతోంది. షమి ఇప్పటికే కొవిడ్‌ నుంచి కోలుకున్నాడు. తాను కొవిడ్‌ నెగటివ్‌గా తేలినట్లు ఇప్పటికే షమి ప్రకటించాడు. అయితే ఈలోగా హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి రావడం విశేషం.

క్రిక్‌బజ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. సెలక్టర్లు సిరాజ్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. షమి, చహర్‌లను స్టాండ్‌బైలుగానే ఉంచి.. సిరాజ్‌ను 15 మంది టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆ రిపోర్ట్‌ వెల్లడించడం విశేషం. నిజానికి అతన్ని ఎంపిక చేయకపోవడంపై గతంలోనే హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. ఈ మధ్య ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా కూడా సిరాజ్‌కు జరుగుతున్న అన్యాయంపై కొందరు తమ గళం వినిపించారు.

అయితే ఇప్పుడు బుమ్రా గాయపడటంతో సిరాజ్‌కు అవకాశం వస్తుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అనూహ్యంగా అతని పేరును పరిశీలిస్తున్నారన్న వార్తలు రావడం విశేషం. అయితే ఇప్పటికే జడేజా కూడా దూరమైన పరిస్థితుల్లో బుమ్రా సేవలు కూడా కోల్పోవడం మాత్రం ఇండియాకు మింగుడు పడనిదే. ఆస్ట్రేలియా గడ్డపై బుమ్రా లేకుండా ఇండియా టీ20 వరల్డ్‌కప్‌ గెలవడం సులువు కాదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం