India vs Pakistan test Series: భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌పై ఇంగ్లాండ్ ఆసక్తి.. బీసీసీఐ రియాక్షన్ ఏంటో తెలుసా?-england interested to host test series between india and pakistan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Pakistan Test Series: భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌పై ఇంగ్లాండ్ ఆసక్తి.. బీసీసీఐ రియాక్షన్ ఏంటో తెలుసా?

India vs Pakistan test Series: భారత్-పాక్ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌పై ఇంగ్లాండ్ ఆసక్తి.. బీసీసీఐ రియాక్షన్ ఏంటో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Sep 28, 2022 09:14 AM IST

ECB Host India vs Pakistan Test: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వాలని ఆసక్తి కనబర్చింది. అయితే ఈ అంశంపై బీసీసీఐ మాత్రం సుముఖంగా లేదు.

<p>భారత్-పాకిస్థాన్&nbsp;</p>
<p>భారత్-పాకిస్థాన్&nbsp;</p> (Twitter)

Bilateral Test Series Between India vs Pakistan: ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. చిరకాల ప్రత్యర్థిని కసిగా ఓడించాలనే భారత ఫ్యాన్స్ ఉత్కంఠగా చూస్తుంటారు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల జరగని కారణంగా.. మల్టీ టీమ్ ఈవెంట్ లేదా ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఆ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఎలా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగా టీఆర్పీ రేటింగుల్లోనూ టాప్‌లో ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ECB) ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇంగ్లాండ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగే దిశగా పావులు కదుపుతోంది.

క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈసీబీ ఛైర్మన్ మార్టిన్ డార్లో.. ఇంగ్లీష్ గడ్డపై భారత్-పాక్ మధ్య టెస్టు సిరీస్ జరపాలనే ఆలోచనతో ముందుకొచ్చారని సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ఆడనున్న సమయంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ టీ20 సిరీస్ జరిగే వేదికల్లోనే ఇండియా-పాక్ టెస్టు సిరీస్ నిర్వహించాలనే ప్లాన్ ఉన్నారట. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఈ విషయంపై చర్చించారని సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై బీసీసీఐ మాత్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించిన బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు.. పాక్‌తో సిరీస్‍పై నిర్ణయం తీసుకునే అధికారం భారత ప్రభుత్వం చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు.

"భారత్-పాకిస్థాన్ సిరీస్ గురించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. పీసీబీతో చర్చించడమే విడ్డూరంగా ఉంది. ఏ సందర్భంలోనైనా పాక్‌తో టీమిండియా సిరీస్ విషయంపై పూర్తి నిర్ణయం తీసుకునే అధికారం భారత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. మేము పాకిస్థాన్‌తో మల్టీ టీమ్ ఈవెంట్ లేదా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడతాం." అని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఇంగ్లీష్ క్రికెటర్ మొయిన్ అలీ మాత్రం భారత్-పాక్ టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ నిర్వహించడం అద్భుతమైన ఐడియా అంటూ కొనియాడాడు. "ఈ ఐడియా అద్భుతంగా ఉంది. రెండు గొప్ప జట్లు, క్రికెట్ బాగా ఆడే దేశాలు ప్రపంచకప్ లేదా ఐసీసీ ఈవెంట్లలో మినహా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆడకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఈ మ్యాచ్ చూసే వారి సంఖ్య, వీక్షణ గణాంకాలను పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ఎక్కువ మంది చూస్తారు. ఎందుకంటే వీరి మధ్య చాలా కాలంగా మ్యాచ్‌లు జరగట్లేదు. పాకిస్థాన్‌కు మంచి బౌలింగ్ ఎటాక్ ఉంది. అలాగే భారత్‌ మేటీ టెస్టు జట్టు. ఈ రెండింటి మధ్య టెస్టు సిరీస్ గొప్పగా ఉంటుంది" అని వ్యాఖ్యానించాడు.

రాజకీయాల కారణంగా భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ రెండు జట్లు చివరిసారిగా 2012లో వన్డే సిరీస్ ఆడాయి. ఇక టెస్టుల విషయానికొస్తే 2007లో చివరిగా పరస్ఫరం తలపడ్డాయి.

సంబంధిత కథనం