Shoaib Akhtar on Bumrah: అక్తర్ ఏడాది కిందటే చెప్పేశాడు.. బుమ్రా వెన్ను విరుగుతుందని.. వీడియో వైరల్
Shoaib Akhtar on Bumrah: అక్తర్ ఏడాది కిందటే బుమ్రా వెన్ను విరుగుతుందని చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. వెన్ను గాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో తెరపైకి వచ్చింది.
Shoaib Akhtar on Bumrah: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇండియాకు పెద్ద షాక్ తగిలిన విషయం తెలుసు కదా. వెన్ను గాయం కారణంగా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ ఏడాది గాయం, విశ్రాంతి అంటూ పెద్దగా మ్యాచ్‌లు ఆడలేదతడు. అయితే ఈ మధ్య గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన అతడు.. ఇప్పుడు సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు కూడా గాయంతో ఆడటం లేదని ప్రకటించారు.
కానీ ఆ గాయం ఇప్పుడతన్ని వరల్డ్‌కప్‌కు దూరం చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే బుమ్రా ఇలా వెన్ను గాయానికి గురవుతాడని ఏడాది కిందటే పాకిస్థాన్ మాజీ పేస్‌బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. బుమ్రా బౌలింగ్ స్టైలే అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అయితే ఆ బౌలింగ్ స్టైల్ దీర్ఘకాలంలో అతనిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎప్పటి నుంచో కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.
అందులో భాగంగానే ఏడాది కిందట స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ యాక్షన్ గురించి అక్తర్ వివరించాడు. "బుమ్రా బౌలింగ్ ఫ్రంటల్ యాక్షన్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే ఇలాంటి యాక్షన్ ఉన్న బౌలర్లు తమ వెన్ను, భుజం స్పీడ్ ద్వారా బౌలింగ్ చేస్తారు. మేము సైడ్ ఆన్ యాక్షన్ ద్వారా బౌలింగ్ చేసేవాళ్లం కాబట్టి అది వెన్నుపై అంతగా ప్రభావం చూపేది కాదు. ఫ్రంటాన్ యాక్షన్‌లో మాత్రం అది కుదరదు" అని అక్తర్ స్పష్టం చేశాడు.
ఈ సందర్భంగా వెస్టిండీస్, న్యూజిలాండ్ మాజీ బౌలర్లు ఇయాన్ బిషప్, షేన్ బాండ్‌ల ఉదాహరణలు కూడా చెప్పాడు. "ఇయాన్ బిషప్ ఇలా వెన్నునొప్పితో బాధపడటం నేను చూశాను. షేన్ బాండ్ కూడా అంతే. ఈ ఇద్దరవీ ఫ్రంటల్ యాక్షన్సే. అందుకే బుమ్రా ఇప్పుడు దీనిపై ఆలోచించాలి. ఓ మ్యాచ్ ఆడాలి. ఆఫ్ తీసుకోవాలి. రీహ్యాబ్‌కు వెళ్లాలి. అతడు మ్యాచ్‌లను ఇలాగే మేనేజ్ చేయాలి. అతన్ని ప్రతి మ్యాచ్‌లో ఆడిస్తే ఏడాది అతని వెన్ను విరుగుతుంది. ఐదు మ్యాచ్‌లలో మూడు ఆడించి పక్కన పెట్టండి. అతడు ఎక్కువ కాలం ఆడాలంటే ఇదొక్క పని కచ్చితంగా చేయాలి" అని అక్తర్ చెప్పాడు.
ఇప్పుడు సరిగ్గా బుమ్రా అలాగే వెన్ను గాయానికి గురై వరల్డ్‌కప్‌కు దూరం కావడంతో ఆ వీడియో మరోసారి వైరల్ అయింది. అక్తర్ ఎంత కచ్చితంగా ఆ విషయాన్ని చెప్పాడో అంటూ అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. అక్తరే కాకుండా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ కూడా బుమ్రా గురించి గతంలో ఇదే విషయం చెప్పాడు.