Ind vs SA T20: చెలరేగిన సూర్య, రాహుల్.. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా-india beat south africa by 8 wickets in the first t20i ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Sa T20: చెలరేగిన సూర్య, రాహుల్.. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా

Ind vs SA T20: చెలరేగిన సూర్య, రాహుల్.. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా

Hari Prasad S HT Telugu

Ind vs SA T20: తొలి టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది టీమిండియా. బౌలర్లు చెలరేగి సఫారీలను కట్టడి చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని సూర్య, రాహుల్ కలిసి సులువుగా చేజ్ చేశారు.

కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ (AP)

Ind vs SA T20: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న టీమిండియా.. సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. తొలి మ్యాచ్ లో సఫారీలను 8 వికెట్లతో చిత్తు చేసి మూడు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. 107 రన్స్ టార్గెట్ ను మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేసింది.

సూర్యకుమార్ యాదవ్ మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అటు ఓపెనర్ కేఎల్ రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడినా.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. సూర్య కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. రాహుల్ సిక్స్ తో మ్యాచ్ ముగించడంతోపాటు హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. రాహుల్ 56 బంతుల్లో 51, సూర్య 33 బంతుల్లో 50 రన్స్ చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 10.3 ఓవర్లలో 93 రన్స్ జోడించారు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ (0), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (3) విఫలమయ్యారు.

అర్ష్‌దీప్‌, దీపక్ షో

అంతకుముందు టీమిండియా బౌలర్లు చెలరేగారు. దీంతో సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 రన్స్‌ మాత్రమే చేయగలిగారు. పవర్‌ ప్లేలోనే అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్‌ చహర్‌లు సౌతాఫ్రికా టాపార్డర్‌ను దెబ్బతీయడంతో ఆ టీమ్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఒక దశలో 9 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయినా.. కేశవ్‌ మహరాజ్‌ (41), మార్‌క్రమ్‌ (25), పార్నెల్‌ (24) పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది.

టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, దీపక్‌ చహర్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ వికెట్‌ తీయకపోయినా.. 4 ఓవర్లలో కేవలం 8 రన్స్‌ మాత్రమే ఇచ్చి సౌతాఫ్రికాను కట్టడి చేశాడు. మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కూడా 4 ఓవర్లలో 16 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియాకు తొలి ఓవర్‌ చివరి బంతికే దీపక్‌ చహర్‌ శుభారంభం అందించాడు. అతడు సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమా(0)ను ఔట్‌ చేశాడు. ఇక రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో రెండు, ఐదు, ఆరు బంతులకు ముగ్గురు సఫారీ బ్యాటర్లను ఔట్‌ చేశాడు.

అతని దెబ్బకు డికాక్‌ (1), రూసో (0), మిల్లర్‌ (0) ఔటయ్యారు. ఆ తర్వాతి ఓవర్లో చహర్‌.. స్టబ్స్‌ (0)ను కూడా ఔట్‌ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్‌ 3, చహర్‌ 2 వికెట్లు తీసుకున్నారు. ఈ ఇద్దరి దెబ్బకు నలుగురు బ్యాటర్లు డకౌట్‌ కాగా.. అందులో ముగ్గురు తొలి బంతికే పెవిలియన్‌ చేరారు.

ఈ సమయంలో ఏడెన్‌ మార్‌క్రమ్‌, వేన్‌ పార్నెల్‌ ఆరో వికెట్‌కు కీలకమైన 33 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా టీమ్‌ కోలుకుంది. ఈ ఇద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ.. ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. మార్‌క్రమ్‌ 25 రన్స్‌ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 26 రన్స్‌ జోడించిన పార్నెల్‌ కూడా 24 రన్స్‌ చేసి పెవిలియన్‌ చేరాడు.