Ganguly on Bumrah: బుమ్రా గాయం టీమిండియాకు సమస్యలు తెస్తుంది.. సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
11 January 2023, 12:06 IST
- Ganguly on Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా భారత్ జట్టుకు అతిముఖ్యమైన ఆస్తి, అతడు పదే పదే గాయపడటం సమస్యలు తెస్తుందని తెలిపారు.
బుమ్రా
Ganguly on Bumrah: గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై మూడు నెలల పైనే కావస్తుంది. స్టార్ పేసరైన బుమ్రా జట్టులో లేకపోవడంతో ఆ ప్రభావం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంకతో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినప్పటికీ వెన్ను నొప్పి బాధించడంతో జట్టుకు మళ్లీ దూరమయ్యాడు. టీమిండియా స్టార్ పేసర్ పదే పదే గాయాల పాలవ్వడంతో సర్వత్రా చర్చ తలెత్తుతోంది. తాజాగా ఈ అంశంపై బీసీసీఐ మాజీ ఛైర్మన్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా పదే పదే గాయపడటం భారత జట్టుకు సమస్యలు తెచ్చిపెడుతోందని, అతడు టీమ్‌కు మంచి ఆస్తి అని అన్నారు.
"భారత జట్టుకు బుమ్రా అతి ముఖ్యమైన ఆస్తి(Asset). కాబట్టి సమస్యలు తప్పకుండా ఉంటాయి. ఫాస్ట్ బౌలర్లు తరచూ గాయపడుతుంటారు. వారు తిరిగి కోలుకునేంత వరకు ఎదురుచూడాలి. ఫాస్ట్ బౌలింగ్ చేయడం అంత సులభమేం కాదు." అని గంగూలీ తెలిపారు.
బుమ్రా గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో గాయపడటంతో ఆ తర్వాత జరిగిన ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022కు దూరమయ్యాడు. ఇంతకాలం గాయం నుంచి కోలుకున్న అతడు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ గాయం మళ్లీ తిరగబెట్టడంతో మరోసారి దూరమయ్యాడు.
శ్రీలంకతో వన్డేలకు కూడా బుమ్రా దూరం కావడంతో మరోసారి అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పటికీ కీలక టోర్నీలు, మ్యాచ్‌లకు ఈ స్టార్ పేసర్ దూరమయ్యాడు. అసలే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడనున్న తరుణంలో బుమ్రా ఈ విధంగా జట్టుకు దూరం కావడం ఫ్యాన్స్ కలవర పరుస్తోంది.