Bumrah Doubtful for Australia Series: ఆస్ట్రేలియాతో సిరీస్‌కూ బుమ్రా అనుమానమే
Bumrah Doubtful for Australia Series: ఆస్ట్రేలియాతో సిరీస్‌కూ బుమ్రా అనుమానంగానే కనిపిస్తున్నాడు. ఇప్పటికీ గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు మొదట ఎంపిక చేసి తర్వాత తప్పించిన విషయం తెలిసిందే.
Bumrah Doubtful for Australia Series: టీమిండియా స్టార్ పేస్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో వెన్ను గాయానికి గురైన బుమ్రా.. అప్పటి నుంచి ఇండియాకు ఆడలేదు. నేషనల్ క్రికెట్ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్‌లో ఉన్నాడు.
అయితే అతడు ఈ మధ్యే ఎన్సీఏలో నిర్వహించిన మ్యాచ్ సిమ్యులేషన్ టెస్ట్‌లో పాసయ్యాడు. దీంతో అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఎన్సీఏ అనౌన్స్ చేసింది. అందుకే అతన్ని గత వారం శ్రీలంకతో వన్డే సిరీస్ టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కానీ సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే సోమవారం (జనవరి 9) బుమ్రా ఈ సిరీస్‌లో ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది.
అతని గాయం తగ్గినా వెన్నులో పట్టేసినట్లుగా ఉండటం వల్లే ఈ సిరీస్ ఆడటం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఇప్పుడతడు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. వీటిలో కనీసం తొలి రెండు టెస్టులకైతే బుమ్రా ఆడే ఛాన్స్ కనిపించడం లేదు.
అతని వెన్ను పూర్తిగా సెట్ అవడానికి కనీసం మరో నెల రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో చివరి రెండు టెస్ట్‌ల సమయానికిగానీ అతడు ఫిట్‌గా ఉండే అవకాశం లేదు. అదే జరిగితే ఇండియాకు మరో దెబ్బ పడినట్లే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడానికి ఇండియాకు ఇదే చివరి అవకాశం. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిస్తేనే ఇండియా ఫైనల్ చేరుతుంది.
ఇలాంటి సిరీస్‌కు బుమ్రా లేకుండా దిగడం విజయావకాశాలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. బుమ్రాకు ప్రస్తుతం కేవలం వెన్నులో పట్టేసినట్లుగా మాత్రమే ఉందని, ఆ గాయం పెద్ద తీవ్రమైనదేమీ కాదని కెప్టెన్ రోహిత్ చెబుతున్నాడు. చాలా రోజులుగా అతడు బాగానే కష్టపడుతున్నా.. ఇది దురదృష్టకరమని అన్నాడు.
ఎన్సీఏలో టెస్ట్‌లు పాసైనా.. ముంబైలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు మరోసారి తన వెన్నులో సౌకర్యవంతంగా లేదని ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత అతనికి స్కాన్‌లు నిర్వహించగా.. బుమ్రాకు మరిన్ని రోజుల పాటు రీహ్యాబిలిటేషన్ తప్పనిసరి అని తేల్చారు. ఇప్పుడున్న ఫిట్‌నెస్‌తో బుమ్రా తనపై ఉన్న పనిభారాన్ని మోయలేడని బీసీసీఐ, సెలక్షన్ కమిటీ నిర్ణయించాయి.
ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 1 నుంచి బెంగళూరులో బీసీసీఐ ఓ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పుడీ క్యాంప్‌కు బుమ్రా దూరం కానున్నాడు. అంతేకాదు అంతకుముందు జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కాబోయే టీ20, వన్డే సిరీస్‌లకు కూడా బుమ్రా అందుబాటులో ఉండడు.
సంబంధిత కథనం