తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Salman Butt On Bumrah: బుమ్రా ఫెరారీలాంటోడు.. ఇష్టం వచ్చినట్లు వాడితే కుదరదు: సల్మాన్‌ భట్‌

Salman Butt on Bumrah: బుమ్రా ఫెరారీలాంటోడు.. ఇష్టం వచ్చినట్లు వాడితే కుదరదు: సల్మాన్‌ భట్‌

Hari Prasad S HT Telugu

30 September 2022, 15:10 IST

google News
    • Salman Butt on Bumrah: బుమ్రా ఫెరారీలాంటోడని, ఇష్టం వచ్చినట్లు వాడితే కుదరదని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌. గాయంతో అతడు టీ20 వరల్డ్‌కప్‌కు దూరమైన పరిస్థితుల్లో సల్మాన్‌ ఈ కామెంట్స్‌ చేశాడు.
జస్‌ప్రీత్‌ బుమ్రా
జస్‌ప్రీత్‌ బుమ్రా (Getty)

జస్‌ప్రీత్‌ బుమ్రా

Salman Butt on Bumrah: టీ20 వరల్డ్‌కప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా వెళ్లక ముందే షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ గెలవడంలో కీలకపాత్ర పోషిస్తాడనుకున్న పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయంతో దూరం కావడం టీమ్‌కు మింగుడు పడనిదే. అయితే అతని బౌలింగ్‌ యాక్షన్‌ను చాలా రోజులుగా గమనిస్తున్న వాళ్లు ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని హెచ్చరిస్తూనే ఉన్నారు.

కానీ ఇలా వరల్డ్‌కప్‌లాంటి కీలక సమయంలో గాయపడతాడని ఎవరూ ఊహించలేకపోయారు. ముఖ్యంగా అతనిలాంటి బౌలింగ్‌ యాక్షన్‌ ఉన్న వాళ్లు వెన్ను గాయానికి గురవుతుంటారు. బుమ్రా కూడా గతంలో 2019లోనూ ఇలాగే చాలా కాలం వెన్ను గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక ఏడాది కిందట కూడా బుమ్రా వెన్నుకు ముప్పు తప్పదని పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్ హెచ్చరించాడు.

ఇప్పుడు మరో పాకిస్థాన్‌ ప్లేయర్‌ సల్మాన్‌ భట్‌ కూడా బుమ్రాపై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అతన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని, తగినంత విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. అంతేకాదు బుమ్రాను లగ్జరీ కార్లతోనూ పోల్చాడు. ఫెరారీలాంటి కార్లను వారానికోసారి మాత్రమే తీయాలని, మిగతా కార్లలాగా ఎలా పడితే అలా వాడకూడదని అనడం గమనార్హం.

"బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ అతని వెన్నుపై చాలా ప్రభావం చూపుతుంది. అతడు మూడు ఫార్మాట్లలోనూ ఆడతాడు. దీనికి తోడు సుదీర్ఘంగా సాగే ఐపీఎల్‌ కూడా. అందుకే ఇండియా అతన్ని జాగ్రత్తగా ఆడించాలి. బుమ్రా ఫెరారీ లేదా ఆస్టన్‌ మార్టిన్‌ లేదా లాంబోర్ఘినిలాంటోడు. ఇవి లగ్జరీ కార్లు. స్పీడుంటాయి. వీటిని వీకెండ్‌ కార్లు అంటారు. అవి ప్రతి రోజూ డ్రైవ్‌ చేసే టొయోటా కరోలాలాంటివి కావు. దీనిపై స్క్రాచ్‌ పడినా ఏం కాదు. వీకెండ్‌ కార్లను కేవలం వీకెండ్స్‌లోనే డ్రైవ్‌ చేయాలి. అందుకే నిఖార్సయిన ఫాస్ట్ బౌలర్‌ అయిన బుమ్రాను జాగ్రత్తగా మేనేజ్‌ చేయాలి. అతన్ని ప్రతి మ్యాచ్‌లో ఆడించకూడదు" అని సల్మాన్‌ స్పష్టం చేశాడు.

అయితే బుమ్రా గాయం ఇండియాకు మరో మంచి ఫాస్ట్‌ బౌలర్‌ను తయారు చేసుకునేందుకు వచ్చిన అవకాశమని అతను అభిప్రాయపడ్డాడు. బుమ్రా లేని ఇలాంటి పరిస్థితుల్లో చహర్‌, అర్ష్‌దీప్‌, షమి ఆ లోటు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు.

"బుమ్రా అత్యుత్తమ నాణ్యత కలిగిన బౌలర్‌. అతడు అనుభవజ్ఞుడు, మ్యాచ్‌ విన్నర్‌. మిడిల్, డెత్‌ ఓవర్లు వేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేగలడు. అతడో విలక్షణమైన బౌలర్‌. అతడు లేని లోటు తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితిని ఇండియా ఎలా చూస్తుందన్నది ముఖ్యం. యువకులకు ఇదే మంచి అవకాశం. బుమ్రా కోలుకున్నప్పుడు అతడు టీమ్‌లోకి వస్తాడు. కానీ ఆ లోపు బుమ్రా ఎవరు అవుతారన్నది చూడాలి" అని సల్మాన్ అన్నాడు.

తదుపరి వ్యాసం