Jasprit Bumrah Interview: మొదట్లో చాలా దూకుడుగా ఉండేవాన్ని.. కోపం బాగా వచ్చేది: బుమ్రా
Jasprit Bumrah Interview: మొదట్లో చాలా దూకుడుగా ఉండేవాన్ని.. కోపం బాగా వచ్చేదని అంటున్నాడు టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా. జీక్యూ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నాడు.
Jasprit Bumrah Interview: ఇండియన్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే పోస్టర్ బాయ్‌లా మారిపోయాడు జస్‌ప్రీత్ బుమ్రా. షార్ట్ రనప్, ఫ్రంటల్ బౌలింగ్ యాక్షన్‌తో ఎంతో పేస్ జనరేట్ చేసి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే సత్తా ఉన్న ప్లేయర్ అతడు. అయితే వికెట్ తీసిన తర్వాత బుమ్రా చాలా కామ్‌గా ఉంటాడు. సాధారణంగా పేస్ బౌలర్లు దూకుడుగా ఉంటారు.
ఇదే విషయాన్ని బుమ్రాని అడిగితే.. మొదట్లో తాను ఇలా ఉండేవాడిని కాదని చెప్పాడు. జీక్యూ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు వివిధ అంశాలపై మాట్లాడాడు. "లేదు, నేను ఇలా ఉండేవాడిని కాదు. నిజానికి, నేను క్రికెట్ మొదలుపెట్టిన కొత్తలో పూర్తి భిన్నంగా ఉండేవాడిని. చాలా దూకుడుగా, అన్నింటికీ సై అన్నట్లుగా కనిపించే వాడిని. అయితే నేను భవిష్యత్తులో ఏదైనా సాధించాలని అనుకుంటే నా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను" అని బుమ్రా చెప్పాడు.
నేను ఏదో సాధించాలనుకున్నది ఈ క్రికెట్‌లోనే అని గుర్తించిన సమయంలో నా భావోద్వేగాలను కూడా ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకున్నట్లు బుమ్రా తెలిపాడు. "స్థిరత్వం అనేది తోడ్పడుతుంది. నా అనుభవపూర్వకంగా ఆ విషయం తెలుసుకున్నాను. అనుభవాల నుంచే ఎవరైనా నేర్చుకుంటారు. పొరపాట్లు చేస్తారు. వాటి నుంచే నేను ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా ఉత్తమ ఫలితం ఎలా రాబట్టాలో నేర్చుకున్నాను" అని బుమ్రా చెప్పాడు.
ఇక గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరం కావడంపై కూడా బుమ్రా స్పందించాడు. "ఈ రోజు నాకు కలిసి రాలేదు. నా మనసు ఎక్కడెక్కడికో వెళ్తున్నప్పుడు నన్ను నేను మరో విషయం వైపు దృష్టి మరల్చేలా చేసుకుంటాను. ఆ తర్వాత మెల్లగా అసలు ఏం జరిగిందో విశ్లేషిస్తాను. మంచి రోజైనా, చెడు రోజైనా దానిని విశ్లేషించి ఫలితాలను అందించిన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. చాలా వరకూ నన్ను నేనే విశ్లేషించుకుంటాను. ఒకవేళ నా దగ్గర సమాధానాలు లేని సమయంలో నేను నమ్మే వ్యక్తులను సంప్రదిస్తాను. కోచ్‌ల దగ్గరికి వెళ్లి సలహా అడుగుతాను. నా ఆట గురించి నాకే బాగా తెలుస్తుంది. నా కెరీర్‌ను నేనే తయారు చేసుకున్నాను" అని బుమ్రా వివరించాడు.
బుమ్రాకు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు కొత్త కాదు. ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ సమయంలో తమ కుటుంబమంతా ఒక్కతాటిపైకి వచ్చి మళ్లీ ఎలా గాడిలో పడ్డామో చెప్పుకొచ్చాడు. "మా అమ్మ పని చేయాల్సి వచ్చింది. ఒకరోజు బాగా గడిచేది. మరో రోజు కష్టాలు తప్పలేదు. అప్పుడు ఆ రోజులు చూశాం కాబట్టే ఇప్పుడు ఓ స్థితికి చేరుకున్నాక అక్కడ ఎలా స్థిరపడాలో మాకు తెలుసు. ఆ కష్టకాలం మాకు చాలా నేర్పించింది. మా అమ్మ మాకోసం చాలా చేసింది. ఆమె రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. మేము కుటుంబంగా ఒక్కతాటిపై నిలిచాం" అని బుమ్రా తెలిపాడు.
తాను కచ్చితంగా ఈ పని చేయాలని తన తల్లి ఎప్పుడూ చెప్పలేదని కూడా బుమ్రా అన్నాడు. నేను డాక్టర్ కావాలనో, ఇంజినీర్ కావాలనో ఎప్పుడూ చెప్పలేదు. నేనెప్పుడూ క్రికెట్ ఆడేవాడిని. అసలు వీడు ఏం చేస్తాడో అన్న ఆందోళన ఆమెలో కలిగి ఉంటుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆమె కచ్చితంగా ఉండేది. ఆమె స్కూల్ ప్రిన్సిపల్ కావడంతో నేను కచ్చితంగా ఇంగ్లిష్ నేర్చుకోవాలని చెప్పేది అని బుమ్రా తెలిపాడు.