Sachin at 50: హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్.. సిడ్నీలో మాస్టర్‌కు అరుదైన గౌరవం
24 April 2023, 13:52 IST
Sachin at 50: హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్ అంటూ సిడ్నీలో మాస్టర్‌కు అరుదైన గౌరవం ఇచ్చింది అక్కడి క్రికెట్ గ్రౌండ్. ఎస్‌సీజీలో ఓ గేట్ కు టెండూల్కర్ పేరు పెట్టడం విశేషం.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో సచిన్ టెండూల్కర్
Sachin at 50: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సోమవారం (ఏప్రిల్ 24)తో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ ప్రపంచమంతా అతనికి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాస్టర్‌కు అచ్చొచ్చిన ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఓ గేట్ కు అతని పేరు పెట్టడం విశేషం. ఇండియా బయట తనకు ఎంతగానో కలిసొచ్చిన స్టేడియం ఇదే అని గతంలో సచిన్ కూడా చెప్పాడు.
ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో ఐదు టెస్టులు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ ఏకంగా 785 రన్స్ చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉండగా.. అత్యధిక స్కోరు 241. ఇక సగటు 157గా ఉందంటే ఈ గ్రౌండ్ అంటే మాస్టర్ కు ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు. 1991-92లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటి నుంచీ ఈ ఎస్సీజీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఈ సందర్భంగా సచిన్ చెప్పాడు.
సచిన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.. ఇక్కడ ఓ గేట్ కు సచిన్ తోపాటు వెస్టిండీస్ గ్రేట్ క్రికెటర్ బ్రియాన్ లారా పేరు పెట్టింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆడటానికి వచ్చే విదేశీ జట్ల ప్లేయర్స్ అందరూ ఇదే గేట్ నుంచి గ్రౌండ్ లోకి వస్తారు. అలాంటి గేట్ కు తనతోపాటు తన బెస్ట్ ఫ్రెండ్ లారా పెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్న సచిన్ చెప్పాడు.
లారా 277 రన్స్ చేసిన ఇన్నింగ్స్ కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతని గౌరవార్థం ఈ పేరు పెట్టారు. లారాకు కూడా ఈ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అంటే ఎంతో ఇష్టం. తనకు బాగా కలిసొచ్చిన ఈ గ్రౌండ్ జ్ఞాపకార్థం అతడు తన కూతురికి సిడ్నీ అనే పేరు పెట్టడం విశేషం. ఈ గేట్లను ఎస్సీజీ ఛైర్మన్ రాడ్ మెక్‌గియోక్ ప్రారంభించారు. ఈ గేట్ల దగ్గర సచిన్, లారా తమ కెరీర్లలో సాధించిన రికార్డులను వివరిస్తూ ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇది తనకు గొప్ప గౌరవమని, త్వరలోనే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ను తాను సందర్శిస్తానని సచిన్ చెప్పాడు. అటు లారా కూడా ఇలాగే స్పందించాడు. సిడ్నీ తనకెంతో ఇష్టమైన గ్రౌండ్ అని, తానెప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కి వెళ్తానని అన్నాడు.