Rohit Sharma on T20 World Cup: వరల్డ్‌కప్ గెలవడమే లక్ష్యం.. కానీ అంత సులువు కాదు: రోహిత్
19 October 2022, 19:21 IST
- Rohit Sharma on T20 World Cup: వరల్డ్‌కప్ గెలవడమే తమ లక్ష్యమని, అయితే దాని కోసం తాము చాలా అంశాలు సరిగ్గా చేయాల్సిన అవసరం ఉన్నదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
రోహిత్ శర్మ
Rohit Sharma on T20 World Cup: ఎప్పుడో 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్ గెలిచింది టీమిండియా. ఇప్పటి వరకూ ఈ ఫార్మాట్‌లో మళ్లీ కప్పు గెలవలేదు. 2014లో మాత్రం ఫైనల్ వరకూ వెళ్లింది. గతేడాది అయితే తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఈసారి జరగబోతున్న వరల్డ్‌కప్‌పై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో టీ20ల్లో ఇండియా ఆటతీరు చాలా మెరుగైంది.
సూర్యకుమార్‌లాంటి 360 డిగ్రీ ప్లేయర్, కార్తీక్ ఫినిషింగ్ టచ్, హార్దిక్ ఆల్‌రౌండ్ మెరుపులు, విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడంలాంటి అంశాలు అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే బుమ్రా, జడేజాల రూపంలో ఇద్దరు మ్యాచ్ విన్నర్లు లేకపోవడం కూడా తీరని లోటే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ విజయావకాశాలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో అతడు దీనిపై మాట్లాడాడు.
వరల్డ్‌కప్ గెలవడమే తమ లక్ష్యమని, అయితే దానికోసం తాము చాలా విషయాలు సరిగ్గా చేయాల్సిన అవసరం ఉందని అన్నాడు. "వరల్డ్‌కప్ గెలవక చాలా రోజులు అవుతోంది. ఇప్పుడు మా ఉద్దేశం, జరుగుతున్న ప్రక్రియ అంతా వరల్డ్‌కప్ గెలవడానికే. కానీ దానికోసం మేము చాలా విషయాలు సరిగ్గా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కో అడుగూ వేస్తూ వెళ్తాం" అని రోహిత్ అన్నాడు.
"ఇప్పుడే మరీ ఎక్కువగా ఆలోచించలేం. ఇప్పటి నుంచే సెమీఫైనల్, ఫైనల్స్ గురించి ఆలోచించకూడదు. తలపడబోయే ఒక్కో టీమ్‌పై దృష్టి సారించాలి. దానికోసం అత్యుత్తమంగా సిద్ధం కావడానికి ప్రయత్నించాలి. ఒక్కో టీమ్ కోసం పరిపూర్ణంగా సిద్ధం కావడంపైనే దృష్టిసారిస్తాం. అది సరైన దిశలో సాగే చూస్తాం" అని రోహిత్ చెప్పాడు.
ఈ ఏడాది రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత టీమిండియా టీ20ల్లో బాగా రాణిస్తోంది. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచింది. ఆసియా కప్‌లో చేదు అనుభవం ఎదురైనా.. తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను చిత్తు చేసి కాన్ఫిడెంట్‌గా వరల్డ్‌కప్ బరిలో దిగబోతోంది. ఈ మెగాటోర్నీలో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది.