Kohli Hardik Chat: ఫీల్డ్‌లో 20 నిమిషాలు మాట్లాడుకున్న కోహ్లి, హార్దిక్.. వీడియో వైరల్
Kohli Hardik Chat: ఫీల్డ్‌లో 20 నిమిషాలు మాట్లాడుకుంటూ కనిపించారు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత వీళ్లు ఇలా మాట్లాడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.
Kohli Hardik Chat: టీ20 వరల్డ్‌కప్ ఆదివారం (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం అక్టోబర్ 6నే ఆస్ట్రేలియా వెళ్లింది టీమిండియా. ఇప్పటికే పెర్త్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడింది. అందులో ఒకటి గెలిచి, మరొకటి ఓడిపోయింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత ఫీల్డ్‌లోనే హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి 20 నిమిషాల సేపు మాట్లాడుకున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో విరాట్ ఆడలేడు. అయితే కాసేపు ఫీల్డింగ్ మాత్రం చేశాడు. అటు హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లో 20 బాల్స్‌లో 26 రన్స్ చేసిన ఫర్వాలేదనిపించినా.. రెండో మ్యాచ్‌లో 17 రన్స్ చేసి కీలకమైన సమయంలో ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్‌కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ తర్వాత కూడా హార్దిక్ ప్యాడ్స్ విప్పకుండా నేరుగా కోహ్లి దగ్గరికి వెళ్లి చాలాసేపు మాట్లాడాడు.
ఈ సందర్భంగా తాను ఆడాలనుకున్న షాట్ల గురించి వివరిస్తూ కనిపించాడు. కోహ్లి కూడా అతనికి విలువైన సూచనలు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతంగా రాణించిన రికార్డు కోహ్లికి ఉంది. ఇక్కడి పరిస్థితులు, పిచ్‌ల గురించి విరాట్‌కు బాగా తెలుసు. దీంతో హార్దిక్ కూడా బ్యాటింగ్ విషయంలో అతని సూచనలు తీసుకున్నాడు.
ఈ వీడియోను స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. ఇండియా, ఆస్ట్రేలియాలలో బ్యాటింగ్ చేయడానికి కండిషన్స్‌లో ఉండే మార్పుల గురించి వీళ్లు మాట్లాడుకున్నారు. కోహ్లి ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేయకపోయినా.. నెట్స్‌లో మాత్రం చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. అటు కెప్టెన్ రోహిత్ కూడా నెట్స్‌లో తనదైన స్టైల్లో భారీ షాట్లు ఆడుతూ మంచి రిథమ్‌లో ఉన్నట్లు కనిపించాడు.
టీమిండియా ప్రస్తుతం పెర్త్ నుంచి బ్రిస్బేన్ వెళ్లింది. అక్కడ అక్టోబర్ 17, అక్టోబర్ 19 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.