India vs Western Australia: చేతులెత్తేసిన బ్యాటర్లు.. రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన ఇండియా
India vs Western Australia: టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌కు ముందు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది.
India vs Western Australia: టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంతో ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లి ప్రాక్టీస్ చేస్తున్న ఇండియన్ టీమ్‌కు తొలి ఓటమి ఎదురైంది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. గురువారం (అక్టోబర్ 13) జరిగిన రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. 169 రన్స్ చేజింగ్‌లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో 36 రన్స్ తేడాతో ఓడిపోయింది.
కేఎల్ రాహుల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు కేవలం 55 బాల్స్‌లోనే 74 రన్స్ చేయడం విశేషం. అతడు తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వెళ్లిన పంత్ కేవలం 9 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక దీపక్ హుడా 6, హార్దిక్ పాండ్యా 17, అక్షర్ పటేల్ 2, దినేష్ కార్తీక్ 10 పరుగులు చేశారు. టీమ్‌లో ఉన్నా కూడా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయలేదు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 రన్స్ మాత్రమే చేయగలిగింది.
ఈ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు కూడా విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 రన్స్ చేసింది. అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మూడు వికెట్లూ ఒకే ఓవర్లో రావడం విశేషం. ఇక హర్షల్ పటేల్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. భువీ కూడా ఒక వికెట్ తీశాడు.
వెస్టర్న్ ఆస్ట్రేలియా టీమ్‌లో నిక్ హాబ్సన్, డీఆర్సీ షార్ట్ హాఫ్ సెంచరీలు చేశారు. హాబ్సన్ 64 రన్స్ చేయగా.. షార్ట్ 52 రన్స్ చేసి రనౌటయ్యాడు. ఈ మ్యాచ్‌తో పెర్త్‌లో ఇండియా ప్రాక్టీస్ సెషన్ ముగిసింది. ఇక్కడి నుంచి టీమ్ బ్రిస్బేన్ వెళ్లనుంది. అక్కడి గబ్బా స్టేడియంలో అక్టోబర్ 17, 19 తేదీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్‌తో రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది.