Major Concerns For Team India: ప్రపంచకప్‌లో టీమిండియా ఈ సవాళ్లు అధిగమించేనా? టైటిల్ ఒడిసి పట్టేనా?-five major concerns for team india ahead into the t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Major Concerns For Team India: ప్రపంచకప్‌లో టీమిండియా ఈ సవాళ్లు అధిగమించేనా? టైటిల్ ఒడిసి పట్టేనా?

Major Concerns For Team India: ప్రపంచకప్‌లో టీమిండియా ఈ సవాళ్లు అధిగమించేనా? టైటిల్ ఒడిసి పట్టేనా?

Maragani Govardhan HT Telugu
Oct 13, 2022 07:57 PM IST

Major Concerns For Team India: టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం, డెత్ ఓవర్ల సమస్య లాంటివి టీమిండియాకు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

Major Concerns For Team India: 2007లో వన్డే ప్రపంచకప్ వైఫల్యం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎంతలా అంటే మన అభిమాన ఆటగాళ్ల దిష్టి బొమ్మలు తగులబెట్టేంతగా అసహనానికి గురిచేసింది. అందుకే ఆ ఏడాది జరిగిన మొదటి టీ20 వరల్డ్‌కప్‌పై కూడా ఎలాంటి అంచనాలు లేవు. అందులోనూ స్టార్ క్రికెటర్లయినా సచిన్, గంగూలీ, ద్రవిడ్ కుంబ్లే లాంటి అగ్ర ప్లేయర్లు దూరమయ్యారు. కెప్టెన్‌గా ఎలాంటి అనుభవం లేని యువ మహేంద్రసింగ్ ధోనీకి అప్పగించారు. సగటు క్రికెట్ ప్రియుడుకు ఆ టోర్నీలో భారత్ గెలుస్తుందని ఎలాంటి అంచనాలు లేవు. ఇలాంటి సమయంలో యువ భారత్ అద్భుతమే చేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఇలా ఒక్కొక్క టీమ్‌ను ఓడించి తొలి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా వరుస విజయాలతో దూసుకెళ్లింది.

విజయాల పరంపరకు దోహదపడిన టీ20 ప్రపంచకప్‌ను 2007 తర్వాత ఇంతవరకు టీమిండియా గెలవనే లేదు. 2014లో ఫైనల్ వరకూ చేరినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకోలేకోపోయింది. తర్వాత సీజన్‌లోనూ సెమీస్, గతేడాది జరిగిన టోర్నీలో గ్రూపు దశలో నిష్క్రమించి మరోసారి నిరాశకు గురిచేసింది. ఇప్పటికీ 15 ఏళ్లయింది తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి.. ఈ సారైనా ఆ కోరిక తీరుతుందేమోనని భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే టోర్నీకి ముందే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు గాయంతో దూరమై గట్టి దెబ్బ తగిలింది. పైపెచ్చు ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో పరాజయం భారత్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇలాంటి సమయంలో టీమిండియా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

జస్ప్రీత్ బుమ్రా గాయం..

ఈ ఏడాది ప్రపంచకప్‌లో టీమిండియా ఎదుర్కొంటోన్న ప్రధాన సవాల్.. జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమవడంతో అతడి స్థానాన్ని భర్తీ చేయడమే. దీంతో మహమ్మద్ షమీని అతడి స్థానంలో తీసుకున్నారు. అయితే పొట్టి ఫార్మాట్‌లో ఈ ఏడాది షమీ ఒక్కటంటే ఒక్క టీ20లోనూ ఆడలేదు. స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న దీపక్ చాహర్ కూడా గాయంతో దూరం కావడంతో షమీ తుదిజట్టులో ఉండటం దాదాపు ఖరారైంది. డెత్ ఓవర్లలో బుమ్రాపై ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు అతడు దూరం కావడం నిజంగా షాక్ తగిలింది. ఇప్పటికే జడేజా కూడా నిష్క్రమించడంతో భారత బౌలింగ్‌ కష్టాలు రెట్టింపైనట్లుంది.

<p>జస్ప్రీత్ బుమ్రా</p>
జస్ప్రీత్ బుమ్రా (AFP)

డెత్ బౌలింగ్..

ఆసియా కప్‌లో డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కేవలం డెత్ ఓవర్లలో అధికంగా పరుగులు ఇవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్‌లు కూడా టీమిండియా ఓడిపోయింది. భువనేశ్వర్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడు కూడా అధికంగా పరుగులు సమర్పించాడు. యువ బౌలర్లు హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లాంటి యువ పేసర్లు విఫలం కావడంతో భారత బౌలింగ్ దళం పేలవంగా మారింది. ఫలితంగా బుమ్రా లేని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో స్థిరంగా యార్కర్లు సంధించే బౌలర్లు లేమి, హర్షల్ పటేల్ మిస్టరీ బౌలింగ్ విఫలం కావడం కారణంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది.

హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేదు..

హార్దిక్ పాండ్య పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా టీమిండియాకు పరిణమించాడు. ఈ ఏడాది అతడు బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింట్లోనూ అదరగొట్టాడు. అంతేకాకుండా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపంచగలనని నిరూపించాడు. ఒకవేళ హార్దిక్ పాండ్యా గాయం బారిన పడితే ఏమవుతుందో చూడాలి. అదే నిజమైతే.. జట్టు సమతూల్యత దెబ్బతింటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి టోర్నీ ప్రారంభమైతే పనిభారమంతా అతడిపైనే వేయకూడదు. పొరపాటున గాయం బారిన పడితే అతిడికి ప్రత్యామ్నాయం లేదు.

రిషభ్ పంత్ ఫామ్..

రిషభ్ పంత్ ప్రతిభావంతుడైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. దీర్ఘకాలిక ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న పంత్.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ఆడిన పంత్ పెద్దగా రాణించలేదు. అతడిని ఓపెనర్గగా పంపగా 14 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇంక ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఉండటంతో అతడిని మళ్లీ ఆ స్థానంలో ఆడించడం సాధ్యం కాకపోవచ్చు. పైపెచ్చు పంత్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తుంది. అతడి కంటే దినేష్ కార్తిక్ స్థిరంగా ఆడుతూ.. మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

చాహల్‌కు ఏమైంది?

ఈ ఏడాది ఐపీఎల్‌లో వరుస పెట్టి వికెట్ల తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన యజువేంద్ర చాహల్‌కు ఏమైందో తెలియడం లేదు. ఇటీవల కాలంలో అతడు పెద్దగా రాణించడం లేదు. అయితే టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో కాబట్టి సంప్రదాయంగా చూస్తే అక్కడ లెగ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. కాబట్టి చాహల్‌ తుది జట్టులో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో కొంత రిస్క్ తీసుకున్నప్పటికీ.. అతడు ఫామ్ పుంజుకుంటే మాత్రం మెరుగ్గా రాణిస్తాడు. ఇటీవల కాలంలో జరిగిన ఆసియా కప్‌లో దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా నిలకడగా వికెట్లు కూడా తీయడం లేదు. ఆసియా కప్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో చాహల్ పరుగులను ఎక్కువగా ఇచ్చాడు. అందుకే ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చాడు.

WhatsApp channel

సంబంధిత కథనం