Dravid on Bumrah Replacement: బుమ్రా స్థానంలో షమికే ఛాన్స్.. ద్రవిడ్ హింట్ ఇచ్చేశాడా?
Dravid on Bumrah Replacement: బుమ్రా స్థానంలో షమికే ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయా? టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన కామెంట్స్ ఆ దిశగానే హింట్ ఇస్తున్నాయి.
Dravid on Bumrah Replacement: టీ20 వరల్డ్‌కప్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అన్న చర్చ కొన్ని రోజుల కిందటి వరకూ సాగింది? బుమ్రా ఆడటం లేదు అని బీసీసీఐ తేల్చి చెప్పిన తర్వాత ఇప్పుడతని స్థానంలో ఎవరు అన్న చర్చ మొదలైంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే వారిపై ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కెప్టెన్ రోహిత్ చెప్పగా.. ఇప్పుడు హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా ఆ దిశగా కీలకమైన హింట్ ఇచ్చాడు.
సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బుమ్రా స్థానంలో ఎవరు అన్న ప్రశ్న అతన్ని అడిగారు. దీనిపై ద్రవిడ్ స్పందిస్తూ.. "బుమ్రా లేకపోవడం చాలా పెద్ద లోటు. అతడో గొప్ప ప్లేయర్. కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే వేరే వారికి తమను తాము నిరూపించుకోవడానికి గొప్ప అవకాశం. అతన్ని, అతని వ్యక్తిత్వాన్ని మేము మిస్ అవుతాము" అని అన్నాడు.
మరి బుమ్రా స్థానంలో షమికి అవకాశం ఇస్తారా అన్న ప్రశ్నకు కూడా ద్రవిడ్ సమాధానమిచ్చాడు. "ఈ విషయంపై ఆలోచించాలి. మాకు అక్టోబర్ 15 వరకూ సమయం ఉంది. షమి ఎలాగూ స్టాండ్‌బైస్‌లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతడు ఈ సిరీస్ ఆడలేకపోయాడు. అతన్ని ఈ సిరీస్ ఆడించాలని అనుకున్నది అందుకే. కానీ అతడు నేషనల్ క్రికెట్ అకాడెమీలో ఉన్నాడు" అని ద్రవిడ్ చెప్పాడు.
"అతడు ఎలా కోలుకుంటున్నాడన్న రిపోర్ట్ మాకు అందాల్సి ఉంది. కొవిడ్ తర్వాత 14-15 రోజులకు అతని పరిస్థితి ఏంటన్నది తెలిసిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. అతడు ఎలా ఉన్నాడన్న రిపోర్ట్ అందిన తర్వాత ఎలాగూ మేము ఓ నిర్ణయం తీసుకుంటాం" అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అతడు మాట్లాడిన దానిని బట్టి బుమ్రా స్థానంలో షమి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఇప్పటి వరకూ షమి ఇండియన్ టీమ్‌కు టీ20 ఫార్మాట్‌లో ఆడలేదు. మరోవైపు స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్న దీపక్ చహర్ కూడా బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే రేసులో ఉన్నాడు. అతడు సౌతాఫ్రికాతో సిరీస్ కూడా ఆడాడు. డెత్ ఓవర్లలో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బుమ్రా రీప్లేస్‌మెంట్ నిర్ణయం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు అంత సులువు కాదు. అనుభజ్ఞుడైన షమి వైపు వెళ్లాలా లేక చహర్‌ను తీసుకోవాలా? లేక ఈ ఇద్దరూ కాకుండా సిరాజ్‌లాంటి మరో బౌలర్‌కు అవకాశం ఇవ్వాలా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.