T20 World Cup Prize Money: టీ20 వరల్డ్‌కప్ విజేత ప్రైజ్‌మనీ రివీల్ చేసిన ఐసీసీ
T20 World Cup Prize Money: టీ20 వరల్డ్‌కప్ విజేత ప్రైజ్‌మనీ ఎంతో చెప్పింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). శుక్రవారం (సెప్టెంబర్ 30) ఈ మెగా టోర్నీ ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించింది.
T20 World Cup Prize Money: టీ20 వరల్డ్‌కప్ 2022కు టైమ్ దగ్గర పడుతోంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరగబోయే ఈ మెగా టోర్నీ కోసం అన్ని టీమ్స్ రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం (సెప్టెంబర్ 30) ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించింది. విజేతతోపాటు రన్నరప్, సెమీఫైనలిస్ట్‌లు, లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టే టీమ్స్‌కు దక్కే ప్రైజ్‌మనీ వివరాలు వెల్లడించింది.
టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఇదీ
టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీలో ఎలాంటి మార్పులూ లేవు. గతేడాది వరల్డ్‌కప్‌లో ఆయా టీమ్స్‌కు దక్కిన మొత్తమే ఈసారీ దక్కనుంది. 2022 టీ20 వరల్డ్‌కప్ విజేతకు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఈసారి ఫైనల్ మ్యాచ్ ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. విజేతలాగే ఇతర టీమ్స్‌కు కూడా 2021 వరల్డ్‌కప్ సందర్భంగా ఇచ్చిన ప్రైజ్‌మనీనే ఇవ్వనునన్నారు.
రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు విజేతలో సగం అంటే 8 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇక సెమీఫైనల్స్‌లో ఓడిపోయిన టీమ్స్ ఒక్కోదానికి 4 లక్షల డాలర్లు దక్కుతాయి. మొత్తంగా 16 టీమ్స్ ఈసారి పాల్గొనబోతుండగా.. ఈసారి మొత్తం ప్రైజ్‌మనీ 56 లక్షల డాలర్లుగా ఉంది. సూపర్ 12 స్టేజ్‌లో ఇంటిదారి పట్టే 8 టీమ్స్ ఒక్కో దానికి 70 వేల డాలర్లు ఇస్తారు.
ఇక సూపర్ 12 స్టేజ్‌లో టీమ్ గెలిచే ప్రతి మ్యాచ్కు 40 వేల డాలర్లు దక్కనున్నాయి. గతేడాది వరల్డ్‌కప్‌లోనూ ఇంతే మొత్తం ఇచ్చారు. ఈసారి సూపర్ 12 స్టేజ్ కోసం 8 టీమ్స్ నేరుగా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన నాలుగు టీమ్స్ క్వాలిఫయర్స్‌లో ఆడతాయి. సూపర్ 12 స్టేజ్‌కు క్వాలిఫై అయిన వాటిలో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా ఉన్నాయి.
ఇక శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే, యూఏఈ టీమ్స్ తొలి రౌండ్‌లో తలపడతాయి. ఈ 8 టీమ్స్‌లో నాలుగు సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. తొలి రౌండ్‌లో ప్రతి మ్యాచ్ గెలిచే టీమ్‌కు 40 వేల డాలర్ల ప్రైజ్‌మనీ ఇస్తారు. తొలి రౌండ్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం ప్రైజ్‌మనీ 4.8 లక్షల డాలర్లుగా ఉంది. ఒక తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టే నాలుగు టీమ్స్‌కు కూడా ఒక్కో దానికి 40 వేల డాలర్లు ఇవ్వనున్నారు.
ఈసారి టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 స్టేజ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆతిథ్య ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 22న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే అక్టోబర్ 23న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది. అంతకుముందు అక్టోబర్ 16 నుంచే తొలి రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి.