Misbah About Suryakumar: సూర్యకుమార్‌ రాకతో టీమిండియా బలం పెరిగింది.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు-former pakistan player misbah praises team india cricketer suryakumar yadav ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Misbah About Suryakumar: సూర్యకుమార్‌ రాకతో టీమిండియా బలం పెరిగింది.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు

Misbah About Suryakumar: సూర్యకుమార్‌ రాకతో టీమిండియా బలం పెరిగింది.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Oct 19, 2022 02:09 PM IST

Misbah About Suryakumar: టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్థాన్ మాజీ కోచ్ మిస్బా ఉల్ హఖ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి రాకతో భారత జట్టులో బలం పెరిగిందని స్పష్టం చేశాడు.

<p>సూర్యకుమార్ యాదవ్</p>
సూర్యకుమార్ యాదవ్ (AFP)

Misbah About Suryakumar: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అక్టోబరు 23న పాకిస్థాన్‌తో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుత విజయాన్ని సాధించి టోర్నీ విజయంతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీంతో ప్రస్తుతం అందరి కళ్లు సూర్యకుమార్ యాదవ్‌పైనే ఉన్నాయి. అద్భుత ఫామ్‌తో ఓ రేంజ్‌లో ఆడుతున్న అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం 34 టీ20ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఈ బ్యాటర్‌ జట్టులో కీలకంగా మారాడు. తాజాగా సూర్యకుమార్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ మిస్బా ఉల్ హఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు అన్ని రకాల షాట్లను ఆడగల సమర్థుడని, ఫలితంగా టాపార్డర్‌లో బ్యాటింగ్ చాలా తేలికవుతుందని తెలిపాడు.

“సూర్యకుమార్ రాకతో భారత బ్యాటింగ్ బలం మరింత పెరిగింది. అతడు ఎవరి బౌలింగ్‌లోనైనా అన్ని రకాల షాట్లు ఆడగలడు. ఈ కారణంగా భారత టాపార్డర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ ఫినిషర్ల పాత్రను పోషిస్తున్నారు." అని సూర్యకుమార్‌పై మిస్బా ప్రశంసల వర్షం కురిపించాడు.

గతేడాది పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా తమ విధానాన్ని మార్చుకుందని మిస్బా అన్నాడు. "మొత్తంగా చూసుకుంటే గత సంవత్సరం ప్రపంచకప్ తర్వాత వారు(India) తమ విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారని మీరు గమనించవచ్చు. ఇంతకుముందు వారు ప్రస్తుత పాకిస్థాన్ జట్టు వలే వ్యూహాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు వారు ఇంగ్లాండ్ తరహా విధానాన్ని కలిగి ఉన్నారు. బౌలింగ్‌ను తర్వాత తీసుకోవడం.. పవర్ ప్లేలో రోహిత్-కేఎల్ రాహుల్ గణనీయంగా పరుగులు రాబట్టడం చేస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ కూడా సమయం తీసుకునే ఎదురుదాడికి దిగేవాడు." అని తెలిపాడు.

అక్టోబరు 23న జరగనున్న ఆరంభ మ్యాచ్‌ పాకిస్థాన్-టీమిండియా తలపడనున్నాయి. ఇప్పటికే గతేడాది వరల్డ్ కప్, ఆసియా కప్ పరాభవాల కారణంగా చిరకాల ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం