తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit On Ashwin: అశ్విన్‌ను అందుకే జట్టులోకి తీసుకోలేదు: రోహిత్ శర్మ

Rohit on Ashwin: అశ్విన్‌ను అందుకే జట్టులోకి తీసుకోలేదు: రోహిత్ శర్మ

Hari Prasad S HT Telugu

07 June 2023, 15:41 IST

google News
    • Rohit on Ashwin: అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడానికి కారణమేంటో చెప్పాడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఒకే స్పిన్నర్ తో బరిలోకి దిగింది.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (Hotstar)

రోహిత్ శర్మ

Rohit on Ashwin: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించగలిగిన సీనియర్ స్పిన్నర్ ను పక్కన పెట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ కఠినమైన నిర్ణయం వెనుక కారణమేంటో రోహిత్ టాస్ సందర్భంగా వివరించాడు.

తుది జట్టులో అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాకు చోటు కల్పించారు. పిచ్, ఓవల్ లోని కండిషన్స్ పరిగణనలోకి తీసుకున్న టీమ్ మేనేజ్‌మెంట్ నలుగురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగాలని నిర్ణయించింది. అశ్విన్ ను పక్కన పెట్టడాన్ని టాస్ సందర్భంగా హోస్ట్ నాసిర్ హుస్సేన్ ప్రస్తావించాడు.

దీనికి రోహిత్ సమాధానమిస్తూ.. "ఇది ఎప్పుడైనా కఠిన నిర్ణయమే. అతడు చాలా ఏళ్లుగా మా మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు. అందుకే అతన్ని పక్కన పెట్టడం అన్నది కఠినమైన నిర్ణయమే. కానీ జట్టు అవసరాలకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. అందుకే చివరికి ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాం" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

నిజానికి టెస్టుల్లో ప్రస్తుతం అశ్విన్ 869 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఇక ఓవల్లో ఉన్న కండిషన్స్ నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగేలా చేసినట్లు కూడా రోహిత్ వివరించాడు. "కండిషన్స్, వాతావరణం కూడా మేఘావ్రుతమై ఉంది. పిచ్ పెద్దగా మారేలా కనిపించడం లేదు. నలుగురు పేసర్ల, ఒక స్పిన్నర్ ను తీసుకున్నాం. జడేజా స్పిన్నర్ గా ఉంటాడు" అని రోహిత్ చెప్పాడు.

తుది జట్టులో మహ్మద్ షమి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ లు పేస్ బౌలర్లుగా ఉన్నారు. ఇక భరత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. చాలా కాలం తర్వాత రహానే మరోసారి తుది జట్టులో చోటు సంపాదించాడు.

తదుపరి వ్యాసం