Rohit on Ponting: వాళ్లు చాలా చెబుతారు.. పాంటింగ్‌కు రోహిత్ దిమ్మదిరిగే రిప్లై
Rohit on Ponting: వాళ్లు చాలా చెబుతారు అంటూ పాంటింగ్‌కు రోహిత్ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్.. పాంటింగ్ అభిప్రాయాలతో విభేదించాడు.
Rohit on Ponting: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ బుధవారం (జూన్ 7) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ ఫైనల్ ఓవల్లో జరుగుతుండటంతో ఆస్ట్రేలియాకు అనుకూలిస్తుందన్న ఆ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయాలతో రోహిత్ విభేదించాడు. వాళ్లు చాలా చెబుతారంటూ సులువుగా తీసిపారేశాడు.
"అది అతని అభిప్రాయం. అతడు తన అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. ఏ జట్టు కండిషన్స్ ను సరిగా వినియోగించుకుందో కాలమే చెబుతుంది. క్రికెట్ మ్యాచ్ లను చూసే నిపుణులకు వారి అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటి ఛాంపియన్‌షిప్ ప్రారంభమయ్యే ముందు చాలా చెబుతారు" అని రోహిత్ అనడం విశేషం. ఒత్తిడిని అధిగమించి, కండిషన్స్ ను సరిగా వినియోగించుకునే జట్టే గెలుస్తుందని అతడు స్పష్టం చేశాడు.
"నిజాయతీగా చెప్పాలంటే అవన్నీ మేము పట్టించుకోం. దేనిపై దృష్టిసారించాలో మాకు తెలుసు. జట్టు అదే చేస్తుంది. కండిషన్స్ ను సరిగా వినియోగించుకునే జట్టే గెలిచే అవకాశం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. రానున్న ఐదు రోజుల్లో ఒత్తిడిని అధిగమించాలి. ఎప్పుడోసారి ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. ఆ ఒత్తిడిని సరిగా హ్యాండిల్ చేసి అధిగమిస్తే విజయం వరిస్తుంది" అని రోహిత్ అన్నాడు.
ఇక ఈ ఫైనల్ కు టీమిండియా కొందరు కీలకమైన ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. బుమ్రా, పంత్, రాహుల్, శ్రేయస్ లాంటి వాళ్లు లేరు. దీనిపై స్పందించిన రోహిత్.. ఇప్పుడున్న ప్లేయర్స్ ఒత్తిడిని అధిగమించగలరని అన్నాడు. "మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ బాగా ఎలా ఆడాలి? ఓ జట్టుగా ఏం చేయాలి అన్న అంశాల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా జట్టులో ఉన్న చాలా మంది అనుభవం కలిగిన వాళ్లు. ఎంతో ఒత్తిడిలో ఆడి అధిగమించినవాళ్లు. ప్రతి ఒక్కరూ తమ కెరీర్లలో అలాంటి ఒత్తిడి అనుభవించారు. రేపు తుది జట్టులో ఆడబోయే ప్రతి ప్లేయర్ ఈ ఒత్తిడిని జయించినవాళ్లే. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో వాళ్లకు నేను చెప్పాల్సిన పని లేదు" అని రోహిత్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం