Ponting on Shubman Gill: ఆస్ట్రేలియా బౌలర్లపై శుభ్‌మన్ గిల్ ఆ షాట్ ఆడాలి: పాంటింగ్
Ponting on Shubman Gill: ఆస్ట్రేలియా బౌలర్లపై శుభ్‌మన్ గిల్ ఆ షాట్ ఆడాలి అంటూ పాంటింగ్ కీలకమైన సూచన చేశాడు. ఈ సందర్భంగా గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Ponting on Shubman Gill: ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో శుభ్‌మన్ గిల్ ఎలా ఆడాలన్నదానిపై కీలకమైన సూచన చేశాడు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఈ మధ్యకాలంలో ఇండియన్ టీమ్ లో ప్రధాన ప్లేయర్ గా మారాడు గిల్. అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేశాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ మరోసారి గిల్ కీలకం కానున్నాడు.
ఐపీఎల్లోనూ 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. దీంతో అతనిపై పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడే ప్రధానమైన ప్లేయర్ కావచ్చని అన్నాడు. "అతడో అద్భుతమైన యువకుడు. అతనిలో ఆ ఆటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. మంచి క్లాస్ ఉన్న వ్యక్తి. పేస్ బౌలర్లపై అతడు ఆడే ఫ్రంట్ ఫుట్ పుల్ షాట్ బాగుంటుంది. ఈ ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ పై కూడా గిల్ ఆ షాట్ ఆడాలి" అని పాంటింగ్ అన్నాడు.
ఈ ఫైనల్లో అతడు రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఐపీఎల్లో మూడు సెంచరీలతోపాటు 890 పరుగులు చేసిన గిల్.. అదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తుంది. గిల్ గురువారం(జూన్ 1) ఇంగ్లండ్ లోని జట్టుతో చేరాడు. అతనితోపాటు షమి, జడేజా కూడా గురువారమే అక్కడికి వెళ్లారు.
గత ఆరేడు నెలల కాలంగా గిల్ అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకపై వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఐపీఎల్లోనూ మూడు సెంచరీలు బాదాడు. రెండేళ్ల కిందట న్యూజిలాండ్ తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ గిల్ ఓపెనింగ్ చేశాడు. అయితే అప్పటికి, ఇప్పటికీ అతని ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది.
నిలకడగా ఆడుతున్నాడు. దీంతో గిల్ ను విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్ లతో పోలుస్తున్నారు. ముఖ్యంగా గిల్ ఆడే కొన్ని షాట్లు మాజీ క్రికెటర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు పాంటింగ్ కూడా గిల్ ఫ్రంట్ ఫుట్ పుల్ షాట్ కు ఫిదా అయ్యాడు.
సంబంధిత కథనం