Ponting on Hardik: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో హార్దిక్ పాండ్యా ఉండాల్సింది: పాంటింగ్
Ponting on Hardik: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో హార్దిక్ పాండ్యా ఉండాల్సిందని అన్నాడు రికీ పాంటింగ్. అతడు జట్టులో ఉండి ఉంటే టీమిండియా బలం మరింత పెరిగేదని రికీ స్పష్టం చేశాడు.
Ponting on Hardik: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడబోయే టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండాల్సిందని అన్నాడు. ఆ ఫైనల్లో అతని ఆల్ రౌండ్ సామర్థ్యం ఇండియన్ టీమ్ కు నిర్ణయాత్మక శక్తిగా మారి ఉండేదని అతడు అభిప్రాయపడ్డాడు.
అయితే వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్లో బౌలింగ్ చేసినా.. టెస్ట్ క్రికెట్ కు సరిపడా ఫిట్‌నెస్ మమాత్రం సంపాదించలేదు. కానీ ఈ విషయంలో రికీ పాంటింగ్ వాదన మాత్రం మరోలా ఉంది. ఒకే టెస్ట్ మ్యాచ్ కాబట్టి.. అతన్ని ట్రై చేసి ఉండాల్సిందని చెప్పాడు. ఐపీఎల్లో దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ అతడు బౌలింగ్ చేయడమే పాంటింగ్ కామెంట్స్ కు కారణంగా కనిపిస్తోంది.
"ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ గురించి ఆలోచించినప్పుడు హార్దిక్ పాండ్యా ఉండి ఉంటే ఆ జట్టు మరింత బలోపేతమయ్యేది అనిపించింది. టెస్ట్ క్రికెట్ తన శరీరంపై మరింత భారాన్ని మోపుతుందని అతడే చెప్పాడన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ ఇది కేవలం ఒక్క టెస్ట్ మ్యాచే. ఐపీఎల్లో అతడు ప్రతి మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్నాడు. అది కూడా వేగంగా చేస్తున్నాడు" అని పాంటింగ్ అన్నాడు.
"ఒకే టెస్ట్ మ్యాచ్ కావడంతో పాండ్యా ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు. అతడు బ్యాట్, బాల్ తో ఎలా ఆడేవాడో చూసే అవకాశం దక్కేది. రెండు జట్ల మధ్య అతడే ప్రధాన వ్యత్యాసంగా ఉండేవాడు" అని పాంటింగ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న పాండ్యా.. టెస్ట్ క్రికెట్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఇప్పటి వరకూ అతడు కేవలం 11 టెస్టులే ఆడాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 532 పరుగులు చేశాడు. ఇక 17 వికెట్లు కూడా తీసుకున్నాడు. అదే సమయంలో 74 వన్డేల్లో 1584 పరుగులు, 72 వికెట్లు తీశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే 87 మ్యాచ్ లలో 1271 రన్స్, 69 వికెట్లు తీశాడు. గతేడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కు ట్రోఫీ అందించిన తర్వాత టీమిండియాకూ టీ20లు, వన్డేల్లో కెప్టెన్సీ వహించే అవకాశం అతనికి దక్కింది. ఈసారి కూడా గుజరాత్ ను ఫైనల్ వరకూ తీసుకొచ్చినా.. చివరి బంతికి సీఎస్కే చేతుల్లో ఓటమి తప్పలేదు.
సంబంధిత కథనం