Hardik on Dhoni: నేనెప్పుడూ ధోనీ అభిమానినే: హార్దిక్ పాండ్యా
Hardik on Dhoni: నేనెప్పుడూ ధోనీ అభిమానినే అని అన్నాడు హార్దిక్ పాండ్యా. ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి క్వాలిఫయర్ లో తలపడే ముందు హార్దిక్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.
ఇక తాజాగా ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ లో ధోనీ టీమ్ సీఎస్కే ప్రత్యర్థి అయిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా మిస్టర్ కూల్ పై ప్రశంసలు కురిపించాడు. తానెప్పుడూ ధోనీ అభిమానిగానే ఉంటానని స్పష్టం చేశాడు. మంగళవారం (మే 23) తొలి క్వాలిఫయర్ జరగనున్న నేపథ్యంలో మ్యాచ్ కు ముందు హార్దిక్.. ధోనీ గురించి మాట్లాడుతున్న వీడియోను జీటీ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.
"మహీ చాలా సీరియస్ గా ఉంటాడని చాలా మంది అనుకుంటారు. కానీ నేను మాత్రం అతనితో జోకులు వేస్తాను. అతన్ని మహేంద్ర సింగ్ ధోనీగా చూడను" అని హార్దిక్ అనడం విశేషం. తన డియర్ ఫ్రెండ్, బ్రదర్ ధోనీ నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని కూడా హార్దిక్ చెప్పాడు.
"అతని నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అతనితో మాట్లాడకపోయినా కేవలం చూసి కూడా ఎన్నో సానుకూల అంశాలను ధోనీ నుంచి నేర్చుకున్నాను. నాకు మాత్రం అతడు చాలా మంచి ఫ్రెండ్, సోదరుడు. అతనితో నేను సరదాగా జోకులు వేస్తాను. ఎంజాయ్ చేస్తాను" అని హార్దిక్ అన్నాడు.
"నేనెప్పుడూ ధోనీ అభిమానిగానే ఉంటాను. అయినా ధోనీని ద్వేషించాలంటే అతడు కచ్చితంగా ఓ దెయ్యం అయి ఉండాలి" అని పాండ్యా సరదాగా అన్నాడు. ఇక ఐపీఎల్ 2023లో తొలి ఫైనల్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ తలపడబోతున్నాయి. గతేడాది టాప్ లో నిలిచిన జీటీ.. ఈసారి కూడా తొలి స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవగా.. చెన్నై సూపర్ కింగ్స్ రెండోస్థానంతో అర్హత సాధించింది.
దీంతో మంగళవారం వీళ్ల మధ్య జరిగే మ్యాచ్ లో విజేత నేరుగా ఫైనల్ కు అర్హత సాధించనుండగా.. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఓడిన జట్టు.. ఎలిమినేటర్ లో విజేతతో తలపడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
సంబంధిత కథనం