Hayden on WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలంటే ఇలా చేయండి.. టీమిండియాకు హేడెన్ కీలక సూచన
Hayden on WTC final: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవాలంటే ఇలా చేయండి అంటూ టీమిండియాకు హేడెన్ కీలక సూచన చేశాడు. పదేళ్లుగా ఐసీసీ టైటిల్ కోసం చూస్తున్న ఇండియన్ టీమ్ ఈసారి ఏం చేయాలో అతడు చెప్పాడు.
Hayden on WTC final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి 11 వరకూ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఈ ఫైనల్ జరగబోతోంది. అయితే చివరిసారి 2013లో ఐసీసీ టైటిల్ గెలిచిన ఇండియా.. అప్పటి నుంచీ సెమీఫైనల్స్, ఫైనల్స్ లో బోల్తా పడుతూ వస్తోంది. ఈసారి ఐసీసీ టైటిల్ కరువు తీరాలంటే ఇలా చేయండి అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సూచించాడు.
నిజానికి ఐసీసీ ఈవెంట్లలో ఇండియా బోల్తా పడటానికి కారణంగా తగినంత నైపుణ్యం లేకపోవడం కారణం కాదని, వాళ్ల మైండ్‌సెట్ దీనికి కారణమని హేడెన్ అన్నాడు. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టుపై విపరీతమైన ఒత్తిడి ఉంటుందని అతడు అభిప్రాయపడ్డాడు. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రెండు జట్లకూ ఎలాంటి అడ్వాంటేజ్ లేకుండా బరిలోకి దిగుతున్నాయని చెప్పాడు.
"పాకిస్థాన్ క్రికెట్ తోనూ ఇలాగే జరుగుతుంది. అక్కడ కూడా క్రికెట్ తప్ప మరో ఆటకు ఆదరణ లేదు. అందుకే ఇది మైండ్‌సెట్ కు సంబంధించిన విషయం. స్కోరుబోర్డు, టైటిల్స్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం సరికాదు. ప్రాసెస్ లో భాగం కావడం ముఖ్యం. ఫ్రాంఛైజీ క్రికెట్ చూడండి.
ఈసారి ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ చాలా బాగా ఆడింది. సీఎస్కే, ముంబై ఇండియన్స్ కూడా బాగా ఆడాయి. నేను టీమిండియాకు ఇచ్చే సలహా ఏంటంటే.. ఇండియన్ టీమ్ కూడా ఫలితాల గురించి ఆలోచించకుండా ఆ ప్రక్రియలో భాగం అయితే బాగుంటుంది" అని హేడెన్ అన్నాడు.
ఇక ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై కూడా ప్రశంసలు కురిపించాడు. వచ్చే 15 ఏళ్లలో అతని నుంచి చాలా అద్భుతాలు చూడొచ్చని చెప్పాడు. సుదీర్ఘ కాలంపాటు ఏ క్రికెట్ ఫార్మాట్ లో అయినా అతడు సూపర్ స్టార్ గా కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం