Ashwin Fined: అంపైర్లను అంత మాట అంటావా.. అశ్విన్‌కు జరిమానా
Ashwin Fined: అంపైర్లను అంత మాట అంటావా అంటూ అశ్విన్‌కు జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. అతడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టినట్లు తేలింది.
Ashwin Fined: రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించాడన్న ఆరోపణలపై అతనికి ఫైన్ వేశారు. అశ్విన్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడం గమనార్హం. అంపైర్ల నిర్ణయాన్ని పబ్లిగ్గా తప్పుబట్టడాన్ని నిర్వాహకులు ఉల్లంఘనగా నిర్ధారించారు.
బుధవారం (ఏప్రిల్ 12) చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ పూర్తయిన తర్వాత అశ్విన్ ఈ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.7 ప్రకారం.. అశ్విన్ లెవన్ 1 తప్పిదానికి పాల్పడినట్లు తేలింది. ఓ మ్యాచ్ లో ఎవరైనా ప్లేయర్, అధికారి లేదంటే ప్రత్యర్థి జట్టుపై పబ్లిగ్గా విమర్శలు చేయడాన్ని ఈ ఆర్టికల్ తప్పుబడుతోంది.
ఈ మ్యాచ్ లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని అశ్విన్ విమర్శించాడు. అంపైర్లు వాళ్లకు వాళ్లుగా బంతిని మార్చడాన్ని అతడు తప్పుబట్టాడు. "మంచును కారణంగా చూపుతూ అంపైర్లు వాళ్లకు వాళ్లుగా బంతిని మార్చడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఏడాది ఐపీఎల్లో అంపైర్ల నిర్ణయాలు కొన్ని నన్ను షాక్ కు గురి చేశాయి.
మేము బౌలింగ్ టీమ్ గా ఉన్నాం. మేము బంతిని మార్చమని అడగలేదు. అంపైర్లే బంతిని మార్చారు. కారణం ఏంటి? ఇదే విషయం నేను అంపైర్ ను అడిగితే.. మేము మార్చవచ్చు అని సమాధానమిచ్చాడు. అంటే ప్రతిసారీ మంచు ఉన్నప్పుడల్లా వాళ్లు బంతిని మారుస్తారని అనుకుంటున్నాను. మీరు ఏమైనా చేయండి కానీ అది ప్రామాణికంగా ఉండాలి" అని అశ్విన్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో అన్నాడు.
దీనిని ఐపీఎల్ నిర్వాహకులు తప్పుబట్టారు. ఇలా అంపైర్ల నిర్ణయాలను మీడియా ముందు విమర్శించడాన్ని నేరంగా పరిగణించి జరిమానా విధించారు. ఇదే మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు కూడా రూ.12 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాయల్స్ 3 పరుగుల తేడాతో చెన్నైపై గెలిచారు.
సంబంధిత కథనం