Ashwin Warning to Dhawan: "అంతేలే బ్రో.. మీరు మీరు ఒకటి.." అశ్విన్ మన్కడింగ్‌పై బట్లర్ ఫన్నీ రియాక్షన్..!-ashwin warning to dhawan over potential run out at the non strikers end ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ashwin Warning To Dhawan Over Potential Run Out At The Non Strikers End

Ashwin Warning to Dhawan: "అంతేలే బ్రో.. మీరు మీరు ఒకటి.." అశ్విన్ మన్కడింగ్‌పై బట్లర్ ఫన్నీ రియాక్షన్..!

Maragani Govardhan HT Telugu
Apr 06, 2023 09:14 AM IST

Ashwin Warning to Dhawan: పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్‌ను రవిచంద్రన్ అశ్విన్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో పొటెన్షియల్ రనౌట్ చేసేందుకు యత్నించి ఆగిపోయాడు. వెంటనే కెమెరాలు ఫీల్డింగ్ చేస్తున్న బట్లర్‌పై ఫోకస్ చేయగా.. అతడు అమాయకంగా చూస్తుండిపోయాడు. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

అశ్విన్ మన్కడింగ్‌పై బట్లర్ రియాక్షన్
అశ్విన్ మన్కడింగ్‌పై బట్లర్ రియాక్షన్ (Jio Cinema/Twitter)

Ashwin Warning to Dhawan: స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం గుర్తుందా? 2019 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అశ్విన్.. ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేశాడు. అదేనండి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటడం గమనించిన బౌలర్ రనౌట్ చేయడం. అప్పట్లో ఈ అంశంపై పెద్ద దుమారమే చెలరేగింది. అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని పలు విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ఈ రూల్‌ను మార్చి రనౌట్‌గా చేసినప్పటికి బౌలర్లు అంత సులభంగా ఈ సాహసం చేయరు. కానీ అశ్విన్ అప్పుడు అలా చేసేసరికి అతడిపై విపరీతంగా ట్రోల్ జరిగింది. తాజాగా మరోసారి మన్కడింగ్‌కు ప్రయత్నించాడు ఈ స్పిన్నర్. పంజాబ్-రాజస్థాన్ మధ్య బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరోసారి దీన్ని ప్రయత్నించాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ సారి శిఖర్ ధావన్‌ను మన్కడింగ్ చేసేందుకు అశ్విన్ ప్రయత్నంచాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి బంతిని విసిరేందుకు వచ్చాడు. కానీ అకస్మాత్తుగా అక్కడే ఆగిపోయి.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ధావన్‌ను ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఔట్ చేయలేదు. అశ్విన్ ఆగడం గమనించిన గబ్బర్ కూడా వెంటనే తేరుకుని క్రీజులో బ్యాట్ పెట్టాడు. ఇంతకుముందులా అశ్విన్ ఆలోచించినట్లయితే ధావన్ కూడా ఔటయ్యేవాడు. కానీ అతడు అలా చేయలేదు.

అశ్విన్ మన్కడింగ్‌కు ప్రయత్నించినప్పుడు వెంటనే ఫీల్డింగ్ చేస్తున్న అతడి సహచర ఆటగాడు జోస్ బట్లర్‌ను కెమెరాలో చూపించడం గమనార్హం. బట్లర్ అమాయకంగా చూడటం గమనించవచ్చు. అయితే అశ్విన్ పంజాబ్‌కు ఆడగా.. ఇప్పుడు రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

"అశ్విన్ మన్కడింగ్‌పై బట్లర్‌కు పెద్దగా ఆసక్తిగా లేనట్లుందని" ఓ యూజర్ కామెంట్ చేయగా.. "ధావన్ ఇండియన్ కాబట్టి అశ్విన్ ఔట్ చేయలేదు.. అదే ఇంగ్లీష్ ప్లేయరైనట్లయితే పెవిలియన్ చేరాడే వాడు" అని మరో యూజర్ స్పందించాడు. "మన్కడ్ అని తీసేసి అశ్విన్‌కడ్" అని పెడితే బాగుంటుందని ఇంకొకరు స్పందించారు.

ధావన్ అరుదైన ఘనత..

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధావన్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌పై గబ్బర్ 600 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇది కాకుండా ఐపీఎల్‌లో 50 అర్ధశతకాలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ధావన్ కంటే ముందు కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ 192 పరుగులే చేయగలిగింది. సంజూ శాంసన్(42), షిమ్రన్ హిట్మైర్(36), ధ్రువ్ జురెల్(32) ధాటిగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. రాజస్థాన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్ర‌బ్ సిమ్రన్(60), శిఖర్ ధావన్(86) అర్ధ శతకాలతో విజృంభించారు.

WhatsApp channel