Roberts on Team India: వాళ్లకు పొగరు.. ఏదో ఒక రోజు బొక్క బోర్లా పడతారని తెలుసు: టీమిండియాపై విండీస్ లెజెండ్ ఘాటు వ్యాఖ్య
15 June 2023, 12:38 IST
- Roberts on Team India: వాళ్లకు పొగరు.. ఏదో ఒక రోజు బొక్క బోర్లా పడతారని తెలుసు అంటూ టీమిండియాపై విండీస్ లెజెండ్ ఆండీ రాబర్ట్స్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆండీ రాబర్ట్స్
Roberts on Team India: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయిన టీమిండియాపై వెస్టిండీస్ మాజీ పేస్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అహంకారం, అతి విశ్వాసం వల్లే ఇలా జరిగిందని అతడు అనడం గమనార్హం. ఐపీఎల్ ముఖ్యగా, దేశం ముఖ్యగా అన్న ప్రశ్న మరోసారి తలెత్తిన వేళ రాబర్ట్స్ కూడా ఈ విషయంలో ఇండియన్ టీమ్ కు ఓ సలహా ఇచ్చాడు.
"ఇండియన్ క్రికెట్ లోకి అహంకారం వచ్చి చేరింది. దీని వల్ల మిగతా జట్లను తక్కువ అంచనా వేయడం ప్రారంభమైంది. ఇండియా కచ్చితంగా తాము దేనిపై ద్రుష్టి పెట్టాలో తెలుసుకోవాలి. టెస్ట్ క్రికెటా లేక పరిమిత ఓవర్ల క్రికెటా అనేది. టీ20 క్రికెట్ అలా సాగుతూనే ఉంటుంది. అందులో బ్యాట్ కు, బంతికి మధ్య సరైన పోటీనే లేదు" అని రాబర్ట్స్ అన్నాడు.
"ఇండియా తమ బ్యాటింగ్ బలం చూపుతుందని భావించాను. అజింక్య రహానే పోరాడినా.. బ్యాటింగ్ లో ఎలాంటి మెరుపులూ లేవు. శుభ్‌మన్ గిల్ కొన్ని షాట్లు బాగా ఆడతాడు. కానీ అతడు లెగ్ స్టంప్ గార్డ్ తీసుకోవడం వల్ల తరచూ బౌల్డ్ లేదా వికెట్ల వెనుక క్యాచ్ ఇచ్చి ఔటవుతాడు. విరాట్ కోహ్లికి మాత్రం తొలి ఇన్నింగ్స్ లో స్టార్క్ నుంచి కళ్లు చెదిరే బంతి వచ్చింది. ఇండియన్ టీమ్ లో మంచి ప్లేయర్స్ ఉన్నా.. స్వదేశం బయట ఆడలేకపోతున్నారు" అని రాబర్ట్స్ చెప్పాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో కుప్పకూలుతారని తాను ముందుగానే ఊహించానని, రెండు ఇన్నింగ్స్ లోనూ ఇండియా బ్యాటింగ్ చెత్తగా ఉందని రాబర్ట్స్ స్పష్టం చేశాడు. ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేయగా.. ఇండియా 296 పరుగులకే ఆలౌటైంది. ఇక చివరి ఇన్నింగ్స్ లో 444 పరుగులు చేజ్ చేయాల్సి రావడంతో అది జరగని పని అని తాను ముందుగానే అనుకున్నట్లు రాబర్ట్స్ తెలిపాడు.
నాలుగో రోజు ముగిసే సమయానికి 3 వికెట్లకు 164 పరుగులతో ఉన్నా.. చివరి రోజు తొలి సెషన్ లో టీమ్ కుప్పకూలింది. 70 పరుగులకే చివరి 7 వికెట్లు కోల్పోయి ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ప్రపంచ క్రికెట్ లోని లెజెండరీ ప్లేయర్స్ నుంచి టీమిండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.