Wasim Jaffer: “అందుకు సమయం లేక..”: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టీమిండియా ఓటమికి మూల కారణం చెప్పిన జాఫర్
Wasim Jaffer on Team India loss: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టీమిండియా ఓడిపోయేందుకు మూల కారణాన్ని మాజీ ప్లేయర్ వసీం జాఫర్ చెప్పాడు. ఐపీఎల్ గురించి ప్రస్తావించాడు.
Wasim Jaffer: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్(WTC Final)లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ ఫైనల్‍లో ఓటమి చెంది మరోసారి ఐసీసీ ట్రోఫీని చేజార్చుకుంది. అయితే, ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‍లో భారత జట్టు ఓటమికి కారణాలు ఏంటనే విషయంపై చాలా మంది రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీమిండియాను విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో భారత మాజీ ప్లేయర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ సేన ఓటమికి మూల కారణం ఏంటో చెప్పాడు.
ఐపీఎల్ అయిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండడం టీమిండియాకు ప్రతికూలంగా మారిందని వసీం జాఫర్ అన్నాడు. సన్నద్ధమయ్యేందుకు సరిపడా సమయం లేకపోవడమే ఈ ఫైనల్‍లో భారత జట్టు వైఫల్యానికి మూల కారణమని అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టీమిండియా ప్లాన్‍లను సరిగా అమలు చేయలేకపోవడం, కట్టుదిట్టంగా ఉండకపోవడానికి సన్నద్ధత లోపమే కారణమని స్పోర్ట్స్ కీడాతో చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన 10 రోజులకే అంటే జూన్ 7వ తేదీనే డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలైంది. ఐపీఎల్ లో ఆడిన భారత ఆటగాళ్లు దశల వారీగా ఇంగ్లండ్‍లోని లండన్‍కు చేరుకున్నారు. ప్రధాన ఆటగాళ్లు శుభ్‍మన్ గిల్, మహమ్మద్ సిరాజ్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా.. ఐపీఎల్ ఫైనల్ ఆడి.. ఆలస్యంగా లండన్‍కు చేరుకున్నారు. ఇలా ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‍కు సిద్ధమయ్యేందుకు టీమిండియాకు సరైన సమయం లభించలేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
“బౌలర్ల లెన్త్ (డబ్ల్యూటీసీ ఫైనల్‍లో) చాలాసార్లు షార్ట్ గా ఉంది. ఐపీఎల్ నుంచి బౌలర్లు నేరుగా రావడం ఇందుకు ఓ కారణంగా ఉంది. ఐపీఎల్‍లో బౌలర్లు మ్యాచ్‍లో కేవలం నాలుగు ఓవర్లే వేస్తారు. కానీ ఇక్కడ 17, 18 ఓవర్లు వేయాల్సి ఉంది. ఆ డిఫరెన్స్‌కు బౌలర్ల శరీరాలు అంత త్వరగా అలవాటు పడలేదు” అని జాఫర్ చెప్పాడు.
టీ-20ల నుంచి టెస్టు ఫార్మాట్‍కు కొందరు బ్యాట్స్‌మెన్ అంత త్వరగా మైండ్‍సెట్ మార్చుకోలేకపోయారని జాఫర్ అన్నాడు. ఆఫ్ స్టంప్ అవతల వెళుతున్న బంతులను భారత బ్యాట్స్‌మెన్ సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పాడు.
జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు లండన్‍లో ఓవల్ మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‍లో చివరి రోజు ఫస్ట్ సెషన్‍లోనే టీమిండియా చేతిలో ఉన్న ఏడు వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం చెందింది. ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది.
సంబంధిత కథనం