Ganguly on Rahane: రహానేలాంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు: గంగూలీ ప్రశంసలు
Ganguly on Rahane: రహానేలాంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు అంటూ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 18 నెలల తర్వాత టీమ్ లోకి వచ్చి డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ను ఫాలో ఆన్ నుంచి గట్టెక్కించాడు.
Ganguly on Rahane: అజింక్య రహానేపై ప్రశంసలు కురిపించాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఇలాంటి కమ్‌బ్యాక్ తానెప్పుడూ చూడలేదని అన్నాడు. 18 నెలల తర్వాత జట్టులోకి వచ్చి ఇలా ఆడటం అనేది అద్భుతమని దాదా అభిప్రాయపడ్డాడు. రహానే డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగులు చేయడంతోపాటు శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.
దీంతో రహానే ఇన్నింగ్స్ ను గంగూలీ ఆకాశానికెత్తాడు. "18 నెలల తర్వాత ఇలా ఆడటం ఎంత బాగుంటుంది. టెస్ట్ క్రికెట్ నుంచి అతడు 18 నెలలు దూరంగా ఉన్నాడు. చాలా మంది అతని పనైపోయిందన్నారు. నిజానికి తనకు తాను కూడా అదే అనుకొని ఉంటాడు. ఇండియన్ క్రికెట్ లో ఓ బ్యాటర్ తిరిగి జట్టులో చోటు సంపాదించి తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాదు. ఇది అద్భుతం. గతంలో ఎన్నో కమ్‌బ్యాక్స్ ఉన్నాయి కానీ ఇంత సుదీర్ఘకాలం తర్వాత మాత్రం లేవు" అని గంగూలీ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ చెప్పాడు.
రహానే గతేడాది ఫిబ్రవరి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతకుముందు వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. 2022 ఐపీఎల్లోనూ విఫలమయ్యాడు. అయితే ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తనలోని 2.0ను చూపిస్తూ రహానే చెలరేగడంతో అతనికి టెస్టు జట్టులో మరోసారి స్థానం దక్కింది.
"రహానే చాలా అద్భుతంగా పోరాడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పోరాటం చేశాడు. లంచ్ వరకూ తన ఆట చూసి తానే ఎంతో గర్వంగా ఫీలవుతుంటాడు. ఈ పిచ్ పై ఎలా ఆడాలో అతడు చూపించాడు. పూర్తి ఏకాగ్రతతో, కాస్త లక్ కూడా కలిసొస్తే ఏమవుతుందో కళ్లకు కట్టాడు. ఈ క్రెడిట్ అంతా రహానేది. శార్దూల్ కూడా బాగా ఆడాడు. ఇండియా నుంచి ఇది మంచి ఫైట్" అని గంగూలీ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం