Sunil Gavaskar: రహానేపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు.. అలా ఎప్పుడూ చేయలేదంటూ..
Sunil Gavaskar praises Ajinkya Rahane: భారత బ్యాట్స్‌మన్ రహానేపై సునీల్ గవాస్కర్ పొగడ్తల వర్షం కురిపించాడు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు ఆదుకుంటాడని ప్రశంసించాడు.
టీమిండియా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానేపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్(WTC Final)లో కష్టాల్లో ఉన్న భారత జట్టును రహానే (89 పరుగులు) ముఖ్యమైన హాఫ్ సెంచరీ చేసి ఆదుకున్నాడు. దీంతో టీమిండియాకు ఫాలోఆన్ గండం తప్పింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 296 పరుగులైనా చేయగలిగిందంటే అది రహానే వల్లే అని చెప్పొచ్చు. లండన్ ఓవల్‍లో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మూడో రోజైన నేడు రెండో సెషన్‍లో టీమిండియా 296 పరుగుల వద్ద ఆలౌటైంది. రహానే, శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) కీలకమైన 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పటంతో టాపార్డర్ విఫలమైనా భారత కాస్త కోలుకుంది. ఆస్ట్రేలియాకు 173 పరుగుల ఆధిక్యం దక్కింది. కాగా, కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ భారత జట్టును ఆదుకున్న రహానేపై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
జట్లు కష్టాల్లో ఉన్నప్పుడల్లా అజింక్య రహానే పోరాడి గట్టెక్కించేందుకు అన్ని విధాల కష్టపడతాడని సునీల్ గవాస్కర్ అన్నాడు. అర్ధ శతకాలు, శతకాలు చేసినప్పుడు రహానే ఎప్పుడూ దూకుడుగా సంబరాలు చేసుకోడని అన్నాడు. తన పని తాను చేసుకుపోతాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
“అతడు (అజింక్య రహానే) గతంలో చేసిన శతకాలను చూడండి. ఇండియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే అవి వచ్చాయి. పరిస్థితులకు తగ్గట్టు అతడు ఆడతాడు. పరిస్థితులను పసిగట్టి వాటిని బట్టి ఎలా ఆడాలో అతడికి తెలుసు. హాఫ్ సెంచరీనో, సెంచరీనో చేసినప్పుడు అతడు దూకుడుగా సంబరాలు చేసుకోడు. లో ప్రొఫైల్ ప్లేయర్‌గా ఉంటాడు. కామ్‍గా బ్యాట్ ఎత్తి.. మళ్లీ తన పనిని కొనసాగిస్తాడు” అని గవాస్కర్ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం స్టార్ స్పోర్ట్స్ కామెంటరీ బృందంలో ఉన్న గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో రోజున తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా ఓ దశలో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రవీంద్ర జడేజా, కేఎస్ భరత్‍తో భాగస్వామ్యాలు నెలకొల్పాడు అజింక్య రహానే. మూడో రోజు శార్దూల్ ఠాకూర్‌తో కలిసి కీలకమైన పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి 89 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌటైంది. 173 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా మొదలుపెట్టనుంది.