Ganguly on Rohit: గ్రీన్ పిచ్‌పై ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించొద్దని ఎవరన్నారు?: గంగూలీ
Ganguly on Rohit: గ్రీన్ పిచ్‌పై ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించొద్దని ఎవరన్నారు అంటూ రోహిత్, ద్రవిడ్ చేసిన తప్పిదంపై గంగూలీ అసహనం వ్యక్తం చేశాడు. అశ్విన్ ను తొలగించడంపై దాదా ఇలా స్పందించాడు.
Ganguly on Rohit: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పచ్చిక ఉన్న పిచ్ పై ఆఫ్ స్పిన్నర్ ను ఆడించొద్దని ఎవరు చెప్పారంటూ టీమిండియాను ప్రశ్నించాడు.
రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ లైవ్ కామెంటరీలో రోహిత్, ద్రవిడ్ తీసుకున్న నిర్ణయాన్ని గంగూలీ తప్పుబట్టాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ ఉదాహరణను కూడా చెప్పాడు. అతడు జడేజాను ఔట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ అశ్విన్ ను తీసుకోకుండా టీమ్ ఎంత పెద్ద తప్పు చేసిందో వివరించాడు.
"పచ్చిక ఉన్న పిచ్ పై ఆఫ్ స్పిన్నర్ ఆడకూడదని ఎవరు చెప్పారు? లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ (జడేజా), నేథన్ లయన్ చూడండి. టెస్ట్ క్రికెట్ లో అతడు 400కుపైగా వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు ఇండియా బెస్ట్ బ్యాటర్ ను ఔట్ చేశాడు. టర్న్, బౌన్స్ రెండూ ఉన్నాయి" అని గంగూలీ అన్నాడు.
నిజానికి అశ్విన్ ను తీసుకోకపోవడంపై గంగూలీ అసహనం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. మ్యాచ్ తొలి రోజు కూడా కామెంటరీ సందర్భంగా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. "అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్ ను తీసుకోకుండా ఇండియా తప్పు చేసింది. జడేజాకు మరోవైపు నుంచి సరైన మద్దతు లభించకపోవడం చూస్తుంటే అశ్విన్ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. జడేజా ఓవైపు నుంచి ఒత్తిడి తెస్తున్నా మరోవైపు పరుగులను కట్టడి చేసే బౌలర్ లేడు" అని గంగూలీ అన్నాడు.
ఇక ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ పైనా ప్రశంసలు కురిపించాడు. "అతడు కేవలం ఉపఖండంలోనే వికెట్లు తీయలేదు. ఆస్ట్రేలియాలోనూ తీశాడు. సీమ్ పొజిషన్ బాగుంది. బౌన్స్ బాగుంది. పిచ్ పై పచ్చిక ఉంటే బంతి టర్న్ కాదని కాదు. నా వరకూ అతడు ఆల్ టైమ్ గ్రేట్" అని గంగూలీ అనడం గమనార్హం.
సంబంధిత కథనం