WTC Final: అశ్విన్‍ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదమైందా!: వాన్, గంగూలీ, పాంటింగ్ ఏమన్నారంటే!-is r ashwin omission from team india xi is big mistake in wtc final micheal vaughan sourav ganguly ponting react ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final: అశ్విన్‍ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదమైందా!: వాన్, గంగూలీ, పాంటింగ్ ఏమన్నారంటే!

WTC Final: అశ్విన్‍ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదమైందా!: వాన్, గంగూలీ, పాంటింగ్ ఏమన్నారంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 07, 2023 09:52 PM IST

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఈ తరుణంలో తుది జట్టులోకి భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍ను తీసుకోకపోవటం పెద్ద తప్పిదమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

WTC Final: అశ్విన్‍ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదమైందా! (ANI Photo)
WTC Final: అశ్విన్‍ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదమైందా! (ANI Photo)

WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ తొలి రోజున టీమిండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. లండన్ ఓవల్ మైదానంలో బుధవారం తొలి రోజున టాస్ గెలిచి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. వాతావరణ పరిస్థితులను బట్టి జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాను, నలుగురు పేసర్లను జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍ను తుది జట్టులోకి తీసుకోలేదు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత బౌలర్లు బాగానే రాణించారు. అయితే, బంతి పాతపడుతున్న కొద్దీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‍ను ఇబ్బంది పెట్టలేకపోయారు. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ అదరగొడుతున్నారు. వన్డే రేంజ్‍లో సుమారు 90 స్ట్రయిక్ రేట్‍తో హెడ్ సెంచరీ చేయగా.. స్మిత్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. భారత జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. అశ్విన్‍ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదమని నెటిజన్లు కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

అశ్విన్‍ను పక్కన పెట్టడం టీమిండియా భారీ తప్పిదం అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. “ఇండియాకు అశ్విన్ లేకపోవడం పెద్ద పొరపాటు!!” అని వాన్ ట్వీట్ చేశాడు.

అశ్విన్ లాంటి క్వాలిటీ స్పిన్నర్‌ను జట్టు నుంచి బయట ఉంచడం చాలా కష్టమైన నిర్ణయమేనని బీసీసీఐ మాజీ బాస్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. “నిర్ణయం జరిగిపోయాక చేసే ఆలోచనలను నేను అంతగా పట్టించుకోను. టాస్‍కు ముందు నిర్ణయం తీసుకున్నారు (భారత జట్టు). నలుగురు పేసర్లతో వెళ్లారు. నలుగురు పేసర్లతో వారు గత రెండేళ్లలో బాగా సక్సెస్ అయ్యారు. వాళ్లు టెస్టు మ్యాచ్‍లు గెలిచారు. అయితే, నన్నడిగితే ప్రతీ కెప్టెన్ భిన్నంగా ఉంటారు. రోహిత్, నేను భిన్నంగా ఆలోచిస్తాం. అశ్విన్ లాంటి క్వాలిటీ స్పిన్నర్‌ను తుది జట్టు నుంచి దూరంగా ఉంచడం చాలా కష్టమని నేను అనుకుంటా” అని గంగూలీ స్టార్ స్పోర్ట్స్ చానెల్‍లో తొలి రోజు లంచ్ బ్రేక్ ప్రోగ్రామ్‍లో చెప్పాడు.

ఆస్ట్రేలియన్ లెఫ్ట్ హ్యాండర్లకు బాల్‍ను దూరంగా స్పిన్ చేసేందుకు భారత జట్టులో అశ్విన్ ఉండాల్సి ఉండేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. “ఇప్పుడు వారు (భారత జట్టు) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. కొత్త బాల్‍తో ఆసీస్ బ్యాటింగ్‍ను డ్యామేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మ్యాచ్ సాగే కొద్ది టర్న్ ఉంటుంది. ఆస్ట్రేలియా లెఫ్ట్ హ్యాండర్లకు దూరంగా అశ్విన్ బంతిని స్పిన్ చేయగడు. కానీ అతడు అక్కడ (జట్టులో) లేడు” అని ఛానెల్ 7తో కార్యక్రమంలో పాంటింగ్ అన్నాడు.

టీమిండియా ఫ్యాన్స్ కూడా అశ్విన్.. జట్టులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్‍లో నంబర్ 1 బౌలర్‌ను పక్కనపెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

68 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 259 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ కొనసాగిస్తోంది. ట్రావిస్ హెడ్ (116 బంతుల్లో 106 పరుగులు నాటౌట్) శతకంతో అదరగొడుతుండగా.. స్టీవ్ స్మిత్ (167 బంతుల్లో 63 నాటౌట్) గోడలా నిలబడ్డాడు. తొలి రోజు ఇంకా 20 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అంతకు ముందు ఖవాజా (0), వార్నర్ (43), లబుషేన్ (26) ఔటయ్యారు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ షమీ చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత కథనం