Ind vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‍లో టాస్ గెలిచిన టీమిండియా.. అశ్విన్‍కు దక్కని చోటు
Ind vs Aus WTC Final: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.
Ind vs Aus WTC Final: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ సమరం ఆరంభమైంది. ఇంగ్లండ్‍లోని లండన్‍లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు (జూన్ 7) తుదిపోరు మొదలైంది. ఫైనల్‍లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి భారత జట్టులో ఒకే స్పెషలిస్ట్ స్పిన్నర్ రవీంద్ర జడేజాను తీసుకున్నట్టు హిట్ మ్యాన్ చెప్పాడు. దీంతో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‍కు తుది జట్టులో చోటు లభించలేదు. భారత జట్టులో నలుగురు పేసర్లు ఉన్నారు. వికెట్ కీపర్‌గా తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‍కు చోటు లభించింది.
ఆస్ట్రేలియా జట్టులో పేసర్ బోలాండ్ ప్లేస్ దక్కించుకున్నాడు. అతడు తమ ప్రధాన ఆస్త్రం అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ సమయంలో చెప్పాడు. మరోవైపు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు తుది జట్టులో ప్లేస్ దక్కింది.
రవిచంద్రన్ అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్‌ను తుది జట్టులో తీసుకోకపోవటం కష్టమైన నిర్ణయమేనని, కానీ పరిస్థితులను బట్టి ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. అజింక్య రహానేకు అపార అనుభవం ఉందని హిట్‍మ్యాన్ చెప్పాడు. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నట్టు టాస్ సమయంలో రోహిత్ పేర్కొన్నాడు.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, శ్రీకర్ భరత్ ( వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్సీ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోల్యాండ్
డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్న ఓవల్ పిచ్‍పై గడ్డి బాగా ఉంది. అలాగే వాతావరణం కూడా మేఘావృతమై ఉంది. దీంతో పరిస్థితులు స్వింగ్, సీమ్‍కు అనుకూలించే విధంగా ఉన్నాయి. దీంతో పేసర్లు ఈ మ్యాచ్‍లో కీలకం కానున్నారు. ఈ కారణంతో నలుగురు సీమర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. ఆసీస్ టీమ్‍లోనూ లియన్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు.