Rishabh Pant health update: మెట్లు కూడా ఎక్కేస్తున్నాడు.. పంత్ త్వరలోనే వచ్చేస్తాడా?
15 June 2023, 7:02 IST
- Rishabh Pant health update: మెట్లు కూడా ఎక్కేస్తున్నాడు.. పంత్ త్వరలోనే వచ్చేస్తాడా? అతడు షేర్ చేసిన తాజా వీడియో చూసి అభిమానులు ఇలాగే సంబరపడిపోతున్నారు.
మొదట కష్టంగా, ఆ తర్వాత సులువుగా మెట్లు ఎక్కేస్తున్న రిషబ్ పంత్
Rishabh Pant health update: రిషబ్ పంత్ తీవ్ర గాయాల నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా తాను ఎలాంటి సాయం లేకుండా మెట్లు ఎక్కుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. మొదట ఇదే వీడియోలో కాస్త కష్టంగా చేసిన ఆ పనిని.. ఆ తర్వాత సులువుగా చేసేయడం చూడొచ్చు. ఈ రెండు వీడియోలు చూసిన ఫ్యాన్స్.. పంత్ వేగంగా కోలుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.
వీడియోలో మొదట కష్టంగా మెట్లు ఎక్కడానికి, తర్వాత సులువుగా ఎక్కడానికి మధ్య ఎంత కాలం పట్టిందన్నది మాత్రం రిషబ్ పంత్ వెల్లడించలేదు. "నాట్ బ్యాడ్ యార్ రిషబ్. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే చాలా కష్టంగా అనిపిస్తాయి" అనే క్యాప్షన్ తో పంత్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు.. గెట్ వెల్ సూన్, త్వరలోనే వచ్చేస్తావా అయితే.. ఇలా అయితే పూర్తి ఫిట్‌నెస్ తో క్రికెట్ ఆడటానికి ఇంకా ఎంత సమయం పడుతుందన్న కామెంట్స్ చేశారు.
గతేడాది డిసెంబర్ లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తున్న సమయంలో పంత్ నడుపుతున్న కారు వేగంగా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. త్రుటిలో పంత్ ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. మూడు సర్జరీలు కూడా జరిగాయి.
అప్పటి నుంచీ అతడు క్రికెట్ కు దూరంగానే ఉంటున్నాడు. ఈ ఏడాది టీమిండియా ఆడిన అన్ని సిరీస్ లతోపాటు ఐపీఎల్ మొత్తం ఆడలేదు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తర్వాత పంత్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. కొన్నాళ్లుగా టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ఆపద్బాంధవుడిగా మారిన పంత్ వేగంగా కోలుకొని మళ్లీ జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు.
పంత్ ఉండి ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆదుకునేవాడని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. గత ఏప్రిల్లో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)లో పంత్ రీహ్యాబిలిటేషన్ ప్రారంభించాడు. ఇప్పటి వరకూ టెస్టుల్లో 33 మ్యాచ్ లలో 43.67 సగటుతో 2271 రన్స్ చేశాడు. అందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 30 మ్యాచ్ లలో 865 రన్స్, టీ20ల్లో 66 మ్యాచ్ లలో 987 రన్స్ చేశాడు.