Rishabh Pant Accident: రిషబ్ పంత్‌కు ప్రమాదం ఎలా జరిగింది? మండుతున్న కారులో నుంచి ఎలా బయటపడ్డాడు?
30 December 2022, 11:38 IST
- Rishabh Pant Accident: రిషబ్ పంత్‌కు ప్రమాదం ఎలా జరిగింది? మండుతున్న కారులో నుంచి తనకు తానుగా ఎలా బయటపడ్డాడు? కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పంత్ నిద్రమత్తులోకి జారుకున్నట్లు అతడు వెల్లడించాడు.
ఎడమ కంటిపై తీవ్ర గాయంతో రిషబ్ పంత్
Rishabh Pant Accident: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కారు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయన్న వార్త సంచలనం రేపింది. శుక్రవారం తెల్లవారుఝామున 5.30 గంటల సమయంలో ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పంత్ తలకు, మోకాలికి గాయాలవగా.. కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మరి ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? మండుతున్న కారులో నుంచి పంత్ ఎలా బయటపడగలిగాడు?
కారుకు మంటలు ఎలా అంటుకున్నాయి?
ప్రమాదం జరిగిన సమయంలో పంత్ చాలా వేగంగా కారు నడుపుతున్నట్లు అది జరిగిన తీరు చూస్తే స్పష్టమవుతోంది. ఎందుకంటే కారు డివైడర్‌కు ఢీకొట్టిన నిమిషాల్లోనే మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో గాయాలు బాగానే తగిలినా.. సమయానికి తేరుకున్న అతడు కారు విండ్ షీల్డ్ పగలగొట్టి బయటకు రాగలిగాడు. మరికొన్ని క్షణాలు ఆలస్యమై ఉంటే.. పెను ప్రమాదమే జరిగేది. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే ఉన్నాడు.
పంత్ నిద్ర మత్తులో ఉన్నాడా?
ప్రమాదం జరిగిన తర్వాత పంత్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కారు నడుపుతున్న సమయంలో నిద్ర మత్తులోకి జారుకున్నట్లు అతడే చెప్పాడు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. "కారు నడుపుతున్న సమయంలో పంత్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టి, మంటలు అంటుకున్నాయి. వెంటనే అతన్ని రూర్కీ హాస్పిటల్‌కు తరలించారు. ఇప్పుడతన్ని అక్కడి నుంచి డెహ్రాడూన్‌ను తీసుకెళ్లారు" అని అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాద సమయంలో పంత్ బీఎండబ్ల్యూ కారు నడిపిస్తున్నాడు. మొదట్లో ఈ కారును మెర్సిడీజ్‌గా భావించారు. కానీ తర్వాత పోలీసులు మాత్రం అది బీఎండబ్ల్యూ కారు అని తేల్చారు.
పంత్ గాయాల తీవ్రత ఎంత?
ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌ను రూర్కీలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌కు తరలించారు. పంత్ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ఉత్తరాఖండ్ ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అవసరమైతే పంత్‌ను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి హెలికాప్టర్‌లో తీసుకెళ్తామని చెప్పారు.
ఈ ప్రమాదంలో పంత్‌కు మరీ అంత తీవ్రమైన గాయాలు, ఫ్రాక్చర్లు కాలేదని ఎక్స్-రేలు తేల్చాయి. ముఖ్యంగా తల, మోకాళ్లకు మాత్రమే ఎక్కువ గాయాలు అయ్యాయి. ఎడమ కంటిపైన, మోకాలిపై గాయాలు ఉన్నాయి. అయితే కారు మంటల్లో చిక్కుకోవడంతో పంత్ వెనుక వైపు కాలిన గాయాలు అయ్యాయి. ఈ గాయాలను చూస్తే మరో ఏడాది పాటు క్రికెట్‌కు పంత్ దూరం కానున్నాడు. ఆ లెక్కన వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్ అతడు ఆడే అవకాశాలు కనిపించడం లేదు.
టాపిక్