Gambhir on Rohit and Kohli: ఇలా బ్రేక్స్‌ తీసుకుంటే.. కోహ్లి, రోహిత్‌ వరల్డ్‌కప్‌లో ఆడటం కష్టమే: గంభీర్‌-gambhir on rohit and kohli says they should not take break if they want to play world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gambhir On Rohit And Kohli Says They Should Not Take Break If They Want To Play World Cup

Gambhir on Rohit and Kohli: ఇలా బ్రేక్స్‌ తీసుకుంటే.. కోహ్లి, రోహిత్‌ వరల్డ్‌కప్‌లో ఆడటం కష్టమే: గంభీర్‌

Hari Prasad S HT Telugu
Dec 30, 2022 09:44 AM IST

Gambhir on Rohit and Kohli: ఇలా బ్రేక్స్‌ తీసుకుంటే.. కోహ్లి, రోహిత్‌ వరల్డ్‌కప్‌లో ఆడటం కష్టమే అంటూ టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ (AFP)

Gambhir on Rohit and Kohli: కొన్నాళ్లుగా ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఏ టీమ్‌లో ఏ ప్లేయర్‌ ఉంటాడో, ఏ ప్లేయర్‌ బ్రేక్‌ తీసుకుంటాడో తెలియని దుస్థితి. టీ20లు అయినా, వన్డేలు అయినా కచ్చితంగా ఈ తుది జట్టు బరిలోకి దిగుతుందని అంచనా వేయలేకపోతున్నారు. నైపుణ్యం గల యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉండటం, కీలకమైన ప్లేయర్స్‌ తరచూ గాయాల బారిన పడుతుండటం, అనుభవజ్ఞులైన ప్లేయర్స్‌పై పనిభారం తగ్గించాలన్న నిర్ణయాలతో ఈ పరిస్థితి తలెత్తింది.

ట్రెండింగ్ వార్తలు

టీమ్‌లో తరచూ మార్పులు, కీలకమైన ఆటగాళ్లు బ్రేక్‌ తీసుకుంటుండటంపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోహ్లి, రోహిత్‌లాంటి వాళ్లు ఇలా తరచూ బ్రేక్‌ తీసుకుంటుండటం ఇండియన్‌ టీమ్‌ అవకాశాలను దెబ్బ తీసిందని, ఓ కోర్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవడంలో టీమిండియా విఫలమైందని అభిప్రాయపడ్డాడు.

"మనం కోర్‌ టీమ్‌ను గుర్తించాలి. చాలా ఎక్కువ మార్పులు చేశాం. బాగా సెటిల్‌ అయిన టీమ్ ఎప్పుడూ లేదు. ముఖ్యంగా ఇలా తరచూ బ్రేక్స్‌ అస్సలు తీసుకోకూడదు. వరల్డ్‌కప్‌ దగ్గర పడుతోంది. రోహిత్‌ అయినా, కోహ్లి అయినా వరల్డ్‌కప్‌లో ఆడాలంటే ఇలా బ్రేక్స్‌ తీసుకోవడం మానేసి ఎప్పుడూ టీమ్‌తోనే ఉండాలి. నిలకడగా ఆడాలి. ఇలా బ్రేక్స్‌ తీసుకోవడం వల్ల వరల్డ్‌కప్‌ దగ్గర పడినా ఓ కోర్‌ టీమ్‌ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటుంది. గత రెండు వరల్డ్‌కప్‌లలోనూ అదే జరిగింది" అని స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గంభీర్‌ అన్నాడు.

ఈ మధ్యే శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన టీమ్‌ నుంచి రోహిత్‌, కోహ్లి, రాహుల్‌లకు విశ్రాంతినిచ్చారు. రోహిత్‌ గాయం నుంచి కోలుకోకపోగా.. కోహ్లి, రాహుల్‌ను ఎందుకు పక్కన పెట్టారన్నది తెలియలేదు. వీళ్లు వన్డే సిరీస్‌ టీమ్‌లో మాత్రం ఉన్నారు. వన్డేలకు హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. దీనిపైనా గంభీర్‌ స్పందించాడు.

"వన్డేల్లో హార్దిక్‌కు వైస్‌ కెప్టెన్సీ మంచి నిర్ణయమే. అయితే రోహిత్‌ శర్మ టీ20ల్లోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా హార్దిక్‌ కెప్టెన్‌గా ఉంటాడా లేదా అన్నది చూడాలి. ఒక్క ఐసీసీ టోర్నీతో రోహిత్‌ సామర్థ్యాన్ని తక్కువ చేయడం సరికాదు. ఇక కేఎల్‌ రాహుల్‌కు మాత్రం తుది జట్టులో చోటు కష్టమే" అని గంభీర్ స్పష్టం చేశాడు. టీ20ల నుంచి రోహిత్‌, కోహ్లి బ్రేక్‌ తీసుకుంటుంటే.. రానున్న రోజుల్లో యువకుల నుంచి వాళ్లకు గట్టి పోటీ తప్పదని అన్నాడు.

"పూర్తిగా యువకులతో టీ20 టీమ్‌ను తయారు చేయడం కూడా మంచి ఐడియానే. కేఎల్‌ రాహుల్‌ను ఆడిస్తే టాపార్డర్‌లోనే ఆడించాలి. అతని కోసం ఎవరిని పక్కన పెడతారు? విరాట్‌ కోహ్లి ఆడాలంటే మూడో నంబర్‌లోనే ఆడించాలి? మరి అతని స్థానంలో వచ్చిన యువ ఆటగాడు బాగా ఆడితే ఎలా? అయినా వీళ్ల కోసం యువకులను పక్కన పెడితే అది వారి దురదృష్టమే అవుతుంది" అని గంభీర్‌ స్పష్టం చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం