Virat Kohli took Break from T20s: టీ20ల నుంచి బ్రేక్ తీసుకున్న విరాట్ కోహ్లి.. వన్డేలు, టెస్టులే ఆడనున్న మాజీ కెప్టెన్
Virat Kohli took Break from T20s: టీ20ల నుంచి బ్రేక్ తీసుకోనున్నాడు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. కొన్నాళ్ల పాటు అతడు కేవలం వన్డేలు, టెస్టులే ఆడనున్నట్లు బీసీసీఐకి సమాచారమందించాడు.
Virat Kohli took Break from T20s: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వైఫల్యం తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగాయి. అయితే ఇప్పుడు కోహ్లియే తనకు తానుగా ఈ ఫార్మాట్‌కు కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అతడు బీసీసీఐకి చెప్పినట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ వెల్లడించింది.
మళ్లీ కోహ్లి ఎప్పుడు టీ20ల్లోకి తిరిగొస్తాడో బీసీసీఐకి స్పష్టంగా చెప్పకపోయినా.. ఐపీఎల్‌కు ముందు అయితే అతడు ఈ ఫార్మాట్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు అతడు దూరం కానున్నాడు. మళ్లీ అదే టీమ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం తిరిగి రానున్నాడు. కోహ్లితోపాటు రాహుల్, రోహిత్ కూడా టీ20లకు దూరంగా ఉండనున్నారు. హార్దిక్‌కు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక గాయపడిన రోహిత్ శర్మ జనవరి 10 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని చూస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్ కోసం టీమ్ ఎంపిక మంగళ లేదా బుధవారాల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. టీ20లకు కోహ్లి దూరంగా ఉండనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి కూడా ధృవీకరించారు.
"అవును, టీ20లకు అందుబాటులో ఉండనని కోహ్లి చెప్పాడు. వన్డే సిరీస్‌కు అతడు తిరిగి వస్తాడు. అయితే టీ20ల నుంచి కొన్నాళ్లపాటు బ్రేక్ తీసుకుంటున్నాడా అన్న విషయం మాత్రం ఇంకా తెలియదు. అయితే ముఖ్యమైన సిరీస్‌లకు మాత్రం అతని పేరును పరిశీలనలో ఉంటుంది. రోహిత్ విషయానికి వస్తే అతని గాయంపై తొందరపడదలచుకోలేదు. అతడు ఫిట్‌గా ఉన్నాడా లేదా రానున్న రోజుల్లో నిర్ణయిస్తాం. అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ రిస్క్ తీసుకోలేం" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు వెల్లడించారు.
టీ20ల నుంచి విరాట్ కోహ్లి తనకు తానుగా తప్పుకుంటే సెలక్టర్ల పని సులువవుతుంది. 2024 టీ20 వరల్డ్‌కప్ కోసం ఇప్పటి నుంచే టీమ్‌ను నిర్మించే పనిలో ఉన్న బీసీసీఐ.. కోహ్లి, రోహిత్‌లాంటి సీనియర్ల స్థానంలో యువ ప్లేయర్స్‌ను ఎంకరేజ్ చేయనుంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరూ పూర్తిగా ఆ వరల్డ్‌కప్ ప్లాన్స్ నుంచి తప్పుకోకపోయినా.. ప్రస్తుతానికి వన్డేలు, టెస్టులపై ఎక్కువగా దృష్టి సారించనున్నారు.
వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియా ఆరు టీ20లు ఆడనుంది. అందులో మూడు టీ20లు శ్రీలంకతో జరగనున్నాయి. ఈ సిరీస్ జనవరి 3న ముంబైలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 5న పుణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో మూడు వన్డేలు జరుగుతాయి.
సంబంధిత కథనం