IPL | ఇండియన్ క్రికెట్ టీమ్‌ను రాటుదేల్చిన ఐపీఎల్.. ఈ ఫలితాలే నిదర్శనం!
IPL.. విమర్శల మాట ఎలా ఉన్నా.. ఐపీఎల్ వల్ల టీమిండియాకు ఎంతో మేలు జరిగిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. ఐపీఎల్ ఎంతో మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్లేయర్స్‌పై కోట్ల వర్షం కురిపించింది. అంతేకాదు.. ఇండియన్ టీమ్ ప్రదర్శనను కూడా ఎంతగానో మెరుగుపరిచింది.
ఐపీఎల్.. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు చేసిన మేలెంత? ఈ ప్రశ్న అడిగితే చాలా మంది ప్రతికూలంగానే స్పందిస్తారు. ఏ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ తడబడినా.. దానికి ఐపీఎల్‌నే నిందిస్తారు. అంతెందుకు మొన్నటికి మొన్న టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా దారుణ వైఫల్యానికి కూడా ఇండియన్ ప్రిమియర్ లీగే కారణమని అభిమానులు దుయ్యబట్టారు.
వరల్డ్‌కప్‌కు ముందే ఐపీఎల్‌లో ఆడి ఏమాత్రం విశ్రాంతి లేకుండా బరిలోకి దిగడం వల్లే టీమ్ దారుణంగా ఓడిపోయిందని ఎంతో మంది విశ్లేషించారు. అయితే ఈ విమర్శల మాట ఎలా ఉన్నా.. ఐపీఎల్ వల్ల టీమిండియాకు ఎంతో మేలు జరిగిందన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. ఈ ఐపీఎల్ ఎంతో మంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ప్లేయర్స్‌పై కోట్ల వర్షం కురిపించింది. అంతేకాదు.. ఇండియన్ టీమ్ ప్రదర్శనను కూడా ఎంతగానో మెరుగుపరిచింది.
ఐపీఎల్‌కు ముందు, తర్వాత టీమిండియా వివిధ ఫార్మాట్లలో సాధించిన విజయాలే దీనికి నిదర్శనం. ఈ లీగ్ ప్రారంభమైన తర్వాతే ఇండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. టెస్టుల్లో వరల్డ్ నంబర్‌వన్‌గా ఎదిగింది. విజయాల శాతం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు ముందు, ఆ తర్వాత ఇండియన్ టీమ్ ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్‌కు ముందు టీమిండియా
2008లో ఇండియన్ ప్రిమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇది ఇండియన్ క్రికెట్‌నే కాదు మొత్తం ప్రపంచ క్రికెట్ గమనాన్నే మార్చేసింది. ఫుట్‌బాల్‌లోనే కాదు క్రికెట్‌లోనూ ఇంత డబ్బుందా అని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఐపీఎల్‌దే. అదే సమయంలో ఇండియన్ టీమ్ ప్రదర్శనను మెరుగుపరిచిన క్రెడిట్ కూడా ఈ లీగ్‌కే దక్కుతుంది. ఐపీఎల్ ప్రారంభానికి దశాబ్దానికి ముందు, దశాబ్దం తర్వాత ఇండియా ఆడిన మ్యాచ్‌లు, సాధించిన విజయాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
ఐపీఎల్‌కు ముందు 1996 నుంచి 2007 వరకూ చూసుకుంటే.. ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ టీమ్ ప్రదర్శన అంత మెరుగ్గా ఏమీ లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో ఇండియా మొత్తం 400 వన్డేలు ఆడితే అందులో గెలిచింది కేవలం 193 మాత్రమే. అంటే విజయాల శాతం 48గా ఉంది. 1997లో ఇండియా ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ ఏడాది ఆడిన మొత్తం వన్డేల్లో కేవలం 26 శాతం మాత్రమే గెలిచింది. ఇక ఇదే కాలంలో టీమిండియా ఆడిన టెస్టుల సంగతి చూద్దాం. ఆ 12 ఏళ్లలో ఇండియా మొత్తం 117 టెస్టులు ఆడగా.. కేవలం 38 గెలిచింది. విజయాల శాతం 32 మాత్రమే. అంటే ప్రతి మూడు టెస్టుల్లో ఒక మ్యాచ్ గెలిచింది.
ఐపీఎల్ తర్వాత టీమిండియా
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత టీమిండియా ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 2008 నుంచి 2019 వరకూ 12 ఏళ్ల కాలం తీసుకుంటే.. మొత్తం 360 వన్డేలు ఆడి 193 గెలిచింది. అంటే విజయాల శాతం 62కు చేరింది. ఇది ఐపీఎల్‌కు ముందు 48 మాత్రమే. ఐపీఎల్‌కు ముందు 12 ఏళ్లలో వన్డేల్లో టీమిండియా విజయాల శాతం 50 దాటింది కేవలం ఆరుసార్లు. అదే ఆ తర్వాత 12 ఏళ్లలో ఏ ఏడాది కూడా విజయాల శాతం 50కి తగ్గలేదు.
ఇక 2017లో అయితే అత్యధికంగా 72 శాతం మ్యాచ్‌లను ఇండియా గెలిచింది. టెస్టుల విషయానికి వస్తే.. ఐపీఎల్ తర్వాత 12 ఏళ్లలో ప్రతి రెండు మ్యాచ్‌లలో ఒకటి టీమిండియా గెలిచింది. ఈ కాలంలో 128 మ్యాచ్‌లు ఆడిన ఇండియా 65 గెలిచింది. అంటే విజయాల శాతం 51. అంతకుముందు ఇది కేవలం 32గా ఉంది. 2019లో అయితే ఆడిన 8 టెస్టుల్లో 7 గెలిచింది. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్.. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు ఎంత మేలు చేసిందో స్పష్టంగా తెలుస్తుంది.
సంబంధిత కథనం