Madan Lal About Team India: సీనియర్ ఆటగాళ్లపై భారత మాజీ తీవ్ర విమర్శలు.. మూడేళ్లలో పెద్దగా సెంచరీలే లేవని స్పష్టం
09 December 2022, 18:26 IST
- Madan Lal About Team India: టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ మదన్ లాల్ విమర్శలు సంధించారు. గత మూడేళ్లలో సీనియర్ ఆటగాళ్లు సెంచరీలు పెద్దగా చేయలేదని, ఆఫ్ఘనిస్థాన్‌పై విరాట్ కోహ్లీ శతకం మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదని స్పష్టం చేశారు.
సీనియర్ ప్లేయర్లపై మదన్ లాల్ విమర్శలు
Madan Lal About Team India: ఇటీవల కాలంలో టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆసియా కప్ మొదలుకుని టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్ సిరీస్.. తాజాగా బంగ్లాదేశ్ పర్యటన ఇలా వరుసగా వైఫల్యాలు చెందుతూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ మినహా ఈ మధ్య కాలంలో మెరుగైన ప్రదర్శన చేయలేదు. ప్రస్తుతం బంగ్లాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయి విమర్శలను ఎదుర్కొంటోంది. 7వ ర్యాంకులో ఉన్న బంగ్లా చేతిలో పరాజయం పాలవ్వడంతో పలువురు మాజీలు బాహటంగానే భారత ఆటగాళ్ల పర్ఫార్మెన్స్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మదన్ లాల్ స్పందించారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై మండిపడ్డారు.
"గత మూడేళ్ల రికార్డును గమనిస్తే. సీనియర్ ఆటగాళ్లు ఎన్ని సెంచరీలు చేశారు? వయస్సు కారణంగా చేతి-కంటి సమన్వయం మందగిస్తుంది. కానీ వారు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. టాపార్డర్ బ్యాటర్లు ప్రదర్శన చేయకపోతే గెలవలేం." అని మదన్ లాల్ అన్నారు.
ప్రతి ఫార్మాట్‌కు ఆటగాళ్లను మార్చాలని, విభిన్న ప్లేయర్లు ఆడాలని మదన్ లాల్ తెలిపారు. మిగతా దేశాలు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నాయో గమనించాలని దిశానిర్దేశం చేశారు.
"అకస్మాత్తుగా భారత బౌలింగ్ విభాగం దారుణంగా బలహీన పడింది. ఎలా ఉందంటే వారు ఇకపై వికెట్లు తీయలేరేమో అనేంతగా ఆడుతున్నారు. బంగ్లాపై రెండో వన్డేలో 69 పరుగులకే 6 వికెట్లు తీసినప్పటికీ 271 పరుగుల భారీ స్కోరు సాధించిందంటే అది మనవాళ్ల పేలవ ప్రదర్శనే కారణం. అసలేం జరుగుతుంది? ప్రతి దేశం ఇలానే ఆడుతుందా.. విభిన్న ఫార్మాట్లకు స్పెషలైజ్డ్ క్రికెటర్లు కావాలి. విభిన్న ఫార్మాట్లను విభిన్న ఆటగాళ్లు ఎందుకు ఉండరు? ప్రతి దేశం ఈ ఫార్మాట్‌ను అనుసరిస్తుంటే.. భారత్ ఎందుకు చేయడం లేదు." అంటూ మదన్ లాల్ విమర్శలు సంధించారు.
గతేడాది అత్యంత విజయవంతమైన జట్టుగా ఎదిగిన భారత్.. 2022లో మాత్రం అంతే వైఫల్యాలను చవిచూస్తోంది. టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌పైన దృష్టి సారించాలని అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ప్రదర్శన చూస్తే అలా కనిపించడం లేదు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో వరుసగా వన్డే సిరీస్‌లను కోల్పోయి అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇంకా ఆలస్యం కాకముందే మేల్కొనాల్సి ఆవశ్యకత ఉంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ సిరీస్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీమిండియా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. మొదటి వన్డేలో రాహుల్ అర్ధసెంచరీ మినహా.. భారత ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.