Ravindra Jadeja congratulates Wife Rivaba: హలో ఎమ్మెల్యే అంటూ భార్యకు కంగ్రాట్స్ చెప్పిన జడేజా
09 December 2022, 16:31 IST
- Ravindra Jadeja congratulates Wife Rivaba: హలో ఎమ్మెల్యే అంటూ భార్యకు కంగ్రాట్స్ చెప్పాడు క్రికెటర్ రవీంద్ర జడేజా. గుజరాత్ ఎన్నికల్లో అతని భార్య రివాబా జడేజా ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.
భార్య, ఎమ్మెల్యేగా గెలిచిన రివాబాతో రవీంద్ర జడేజా
Ravindra Jadeja congratulates Wife Rivaba: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పుడు ఓ ఎమ్మెల్యేకు భర్త అయ్యాడు. అతని భార్య రివాబా జడేజా తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె జామ్ నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 57 శాతం ఓట్లు సాధించారు.
ఏకంగా 53 వేలకుపైగా మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కర్షన్‌భాయ్‌పై గెలిచారు. రివాబాకు మొత్తం 88,835 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా తన భార్య రివాబాకు జడేజా శుభాకాంక్షలు చెప్పాడు. ఎమ్మెల్యే గుజరాత్ అనే బోర్డు పట్టుకొని ఉన్న తన భార్యతో కెమెరాకు పోజులిచ్చిన జడేజా.. ఆ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ నువ్వు దీనికి అర్హురాలివి అని అన్నాడు.
"హలో ఎమ్మెల్యే, నువ్వు నిజంగా దీనికి అర్హురాలివి. జామ్‌నగర్ ప్రజలు గెలిచారు. ఈ విజయం సాధించి పెట్టిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను. జామ్‌నగర్ పనులు ఇక వేగంగా జరుగుతాయి" అని జడేజా గుజరాతీలో ట్వీట్ చేశాడు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భార్య తరఫున జడేజా ప్రచారం నిర్వహించాడు.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ వచ్చిన సమయంలోనూ ఆయనను కలిశాడు. ఈ సందర్భంగా ఇలాంటి ఫీల్డింగ్ నువ్వు ముందెప్పుడూ చేసి ఉండవు అని జడేజాతో మోదీ సరదాగా అన్నట్లు కూడా రివాబా చెప్పారు. డిసెంబర్ 1న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జడేజా ఓటు వేశాడు. నిజానికి జడేజా కుటుంబంలో చాలా వరకూ కాంగ్రెస్ విధేయులే.
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన హరి సింగ్ సోలంకికి రివాబా బంధువు. అయినా ఆమె 2019లో బీజేపీలో చేరారు. 2016లో జడేజాను ఆమె పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలోనూ ఆమె మామ కాంగ్రెస్‌కు ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. అయితే జామ్‌నగర్ నార్త్‌లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికే పరిమితమైంది. గుజరాత్‌లో బీజేపీ 156 స్థానాల్లో గెలిచి కొత్త రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.