Danish Kaneria on Team India: ఐపీఎల్‌ కాదు దేశం గురించి ఆలోచించండి.. టీమిండియాకు పాక్‌ మాజీ బౌలర్‌ చురక-danish kaneria on team india says think about the country not about ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Danish Kaneria On Team India: ఐపీఎల్‌ కాదు దేశం గురించి ఆలోచించండి.. టీమిండియాకు పాక్‌ మాజీ బౌలర్‌ చురక

Danish Kaneria on Team India: ఐపీఎల్‌ కాదు దేశం గురించి ఆలోచించండి.. టీమిండియాకు పాక్‌ మాజీ బౌలర్‌ చురక

Hari Prasad S HT Telugu
Dec 09, 2022 04:08 PM IST

Danish Kaneria on Team India: ఐపీఎల్‌ కాదు దేశం గురించి ఆలోచించండి అంటూ టీమిండియాకు పాక్‌ మాజీ బౌలర్‌ డానిష్‌ కనేరియా చురకంటించాడు. బంగ్లాదేశ్‌ చేతుల్లో ఓటమితో ఇప్పుడు ఇండియన్‌ టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బంగ్లాదేశ్ పై సిరీస్ ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా
బంగ్లాదేశ్ పై సిరీస్ ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా (AP)

Danish Kaneria on Team India: ఇండియన్‌ టీమ్‌ను ఇప్పుడు అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఆసియాకప్‌, టీ20 వరల్డ్‌కప్‌లలో ఓటమి పెద్దగా ప్రభావం చూపకపోయినా.. చివరికి బంగ్లాదేశ్‌ చేతుల్లో వన్డే సిరీస్‌ ఓడిపోవడంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌ డానిష్‌ కనేరియా మరింత ఘాటుగా టీమిండియాను విమర్శించాడు. ఐపీఎల్‌ గురించి ఆలోచించడం మానేసి దేశం గురించి ఆలోచించండంటూ సూచించాడు. తన యూట్యూబ్‌ ఛానెల్‌లో కనేరియా ఈ సిరీస్‌ గురించి మాట్లాడాడు.

"ఐపీఎల్‌ గురించి ఆలోచించడం మానేసి దేశం గురించి ఆలోచించండి. ఇండియన్‌ క్రికెట్‌ ముఖ్యం. ఫ్రాంఛైజీ క్రికెట్‌ కాదు. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో డబ్బు ఉండొచ్చు. కానీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోనూ మీరు సంపాదించవచ్చు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు ప్రాముఖ్యత ఇవ్వనంత కాలం ఇలాంటి ఫలితాలు వస్తూనే ఉంటాయి" అని కనేరియా చాలా ఘాటుగా విమర్శించాడు.

ఇండియన్‌ టీమ్‌ అనుసరిస్తున్న రొటేషన్‌ పాలసీని కూడా కనేరియా ప్రశ్నించాడు. అంతేకాదు బంగ్లాదేశ్‌ టీమ్‌ టెస్ట్‌ సిరీస్‌ను కూడా గెలుస్తుందని జోస్యం చెప్పడం విశేషం. "బ్యాటర్లకు తమ స్థానాల గురించి స్పష్టత లేదు. ఎందుకంటే కొన్ని నెలలుగా వాళ్లను వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేయమంటున్నారు. బౌలింగ్‌ అటాక్‌ మారుస్తూనే ఉన్నారు. అసలు ప్లానింగ్‌ కానీ, దానిని అమలు చేయడం కానీ లేదు. అసలు ఓ ప్లానే ఉన్నట్లు అనిపించడం లేదు. ఇండియన్‌ క్రికెట్‌ దిగజారింది. బంగ్లాదేశ్‌ టీమ్‌ టెస్ట్‌ సిరీస్‌ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి" అని కనేరియా స్పష్టం చేశాడు.

అయితే ఆ టెస్ట్‌ సిరీస్‌ కంటే ముందు ఇండియాకు మరో గండం పొంచి ఉంది. శనివారం (డిసెంబర్‌ 10) జరగబోయే మూడో వన్డేలోనూ ఓడిపోతే బంగ్లాదేశ్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌కు రోహిత్‌, దీపక్‌ చహర్‌, కుల్దీప్‌ సేన్‌ దూరమయ్యారు. ఇక టెస్ట్‌ సిరీస్‌ డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభం కానుంది.

WhatsApp channel