Ravindra Jadeja out of T20 world Cup: భారత అభిమానులకు మరో షాక్.. జడ్డూ టీ20 ప్రపంచకప్‌నకు దూరం..!
03 September 2022, 20:33 IST
- Ravindra Jadeja Right knee Surgery: భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఇప్పటికే ఆసియ కప్‌కు దూరం కాగా.. తాజాగా టీ20 ప్రపంచకప్‌నకు కూడా దూరం కానున్నాడు. కుడి మోకాలి గాయం తీవ్రం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించే అవకాశం ఎక్కువగా ఉంది.
రవీంద్ర జడేజా
Jadeja out of T20 world Cup: టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వరుస గాయాల బెడద అభిమానులను కలవరపరుస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే ఐపీఎల్‌లో గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరమైన జడ్డూ.. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌నకూ దూరమయ్యాడు. తాజాగా మరోసారి అతడిని దురదృష్టం వెంటాడేలా ఉంది. అతడు అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు కూడా ఆడే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఆసియా కప్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఆడిన జడ్డూ.. కుడి మోకాలికి గాయమైన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడికి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడామీలో చికిత్స అందిస్తున్నారు.
అయితే కుడి మోకాలికి గాయం తీవ్రంగా ఉండటంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారట. దీంతో అతడు టీ20 ప్రపంచకప్‌లో ఆడేది లేని అనుమానంగా మారింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు.
"జడేజా కుడి మోకాలి గాయం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి అతడి మోకాలికి సర్జరీ చేయాల్సిందిగా నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం సూచించింది. దీంతో జడ్డూ నిరవధికంగా కొన్ని వారాల పాటు జట్టుకు దూరం కానున్నాడు. ఈ కారణంగా అతడు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేస్తాడో ఇప్పుడప్పుడే చెప్పలేం" అని బీసీసీఐ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
ఇది యాంటిరియరీ క్రూసియెట్ లిగమెంట్(ACL)కి సంబంధించింది అయితే వెంటనే దాన్ని నిర్ధారించలేరు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం 6 నెలలు పట్టవచ్చు. అయితే జడేజా కనీసం మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని కచ్చితంగా చెప్పవచ్చు. జడేజా మోకాలి గాయం చాలా కాలం నుంచి ఉందని తెలుస్తోంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడు కుడి మోకాలను దించే సమయంలో ముందు పాదానికి తగిలించడం నిశితంగా చూస్తే అర్ధమవుతుంది.
జడేజా ఇందులో దేశీయ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ, ఐపీఎల్ గేమలన్నీ కలిపి 897 వికెట్లను పడగొట్టాడు. అన్ని ఫార్మాట్లలో 630 గేమ్స్‌లో 7 వేల ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా అన్నీ పార్మాట్లలో కలిపి 13 వేల పరుగులు జోడించాడు.