తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Pakistan Asia Cup 2022: భారత్‌ను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ఒత్తిడే ఉంటుంది.. పాక్ ఓపెనర్ షాకింగ్ రియాక్షన్

India vs Pakistan Asia Cup 2022: భారత్‌ను ఎదుర్కోవడంలో ఎప్పుడూ ఒత్తిడే ఉంటుంది.. పాక్ ఓపెనర్ షాకింగ్ రియాక్షన్

03 September 2022, 16:01 IST

google News
    • India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్‌లో మరో మ్యాచ్ జరగనుంది. ఆదివారం నాడు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో మరోసారి టీమిండియానే పైచేయి సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడి నెలకొంటుందని పాక్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు.
మహమ్మద్ రిజ్వాన్
మహమ్మద్ రిజ్వాన్ (AP)

మహమ్మద్ రిజ్వాన్

Mohammad Rizwan reaction on India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. చిరకాల ప్రత్యర్థిపై క్రికెట్ మ్యాచ్ గెలిచామంటే దేశమంతటా పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే గత కొన్నేళ్లుగా దాయాది జట్టుపై పైచేయి సాధిస్తున్న భారత్.. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా ఓడిపోయి విమర్శల పాలైంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఇప్పటికే పాక్‌ను ఓ సారి ఓడించి ప్రతీకారం తీర్చుకోగా.. మరోసారి దాయాదిపై సమరానికి సై అంటోంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం నాడు గ్రూప్-4 మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌పై పాక్ మాజీ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడే ఉంటుందని పేర్కొన్నాడు.

"భారత్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడే నెలకొంటుంది. ఆసియాలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి ఒత్తిడే భారత్‌కు కూడా ఉంటుంది. కానీ ఎవరైతే ధైర్యంగా ఉండి ప్రశాంతంగా తమ పని చేసుకొని పోతారో వారికి అనుకూలంగానే ఫలితం ఉంటుంది. భారత్‌తో ఆడుతున్నా.. హాంకాంగ్‌తో ఆడుతున్నా.. ప్రత్యర్థి ఎవరైనా గేమ్ బంతి, బ్యాట్ మధ్యనే ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద మ్యాచ్ అయినా ఆత్మవిశ్వాసంతో పాటు హార్డ్ వర్క్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది" అని మహమ్మద్ రిజ్వాన్ స్పష్టం చేశాడు.

ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే స్టేడియంలో టికెట్ల నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోతాయి. టీవీల ముందు లక్షలాది మంది లైవ్‌ మ్యాచ్‌ను వీక్షిస్తారు. రాజకీయాందోళనల కారణంగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లేమి జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఆసియా కప్‌లో పాక్‌పై గెలిచిన టీమిండియా.. ఆదివారం నాడు జరగబోయే మరో మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా వచ్చే వారం జరగనున్న ఫైనల్లోనూ ఈ రెండు జట్లు తలపడితే చూడాలని భావిస్తున్నారు.

శుక్రవారం దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 155 పరుగులు తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. . తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంకాంగ్ ముందుంచిన పాక్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్ష్యాన్ని ఛేదించలేక హాంకాంగ్ జట్టు 38 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు నమోదు చేయకపోవడం గమనార్హం. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లతో విజృంభించగా.. మహమ్మద్ నవాజ్ 53 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నసీమ్ షా 2, షాన్వాజ్ దహానీ ఓ వికెట్ తీశారు.

తదుపరి వ్యాసం