Ravindra Jadeja Bat Gift : ఐపీఎల్ ఫైనల్లో ఆడిన బ్యాట్‌ను అతడికి గిఫ్ట్ ఇచ్చిన జడేజా
01 June 2023, 12:43 IST
- Ravindra Jadeja Bat Gift : ఐపీఎల్ 2023లో చెన్నై విజయం తర్వాత మైదానం అంతా హోరెత్తింది. జట్టును విజయపథంలో నడిపించిన జడేజా కూడా మైదానంలో సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఫైనల్ మ్యాచ్ లో గెలిపించిన బ్యాట్ ను జడేజా గిఫ్ట్ గా ఇచ్చాడు.
రవీంద్ర జడేజా
ఐపీఎల్-2023(IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) టైటిల్ గెలుచుకుంది. దీంతో చెన్నై ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై చెన్నై అంత ఈజీగా ఏం గెలవలేదు. చివరి వరకు విజయం కోసం పోరాడాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. చివరి రెండు బంతుల్లో ఒక బౌండరీ, సిక్సర్ కొట్టి విజయాన్ని అందించాడు.
చివరి ఓవర్‌లో చెన్నైకి 13 పరుగులు కావాలి. మోహిత్ శర్మ(Mohit Sharma) బౌలింగ్ చేశాడు. మోహిత్ తొలి 4 బంతుల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చెన్నై విజయానికి చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉంది. ఐదో బంతికి సిక్సర్, నాలుగో బంతికి బౌండరీ బాదిన జడేజా చెన్నైకి విజయాన్ని అందించాడు.
గెలుపొందిన తర్వాత మైదానం అంతా హోరెత్తింది. జట్టును విజయపథంలో నడిపించిన జడేజా కూడా మైదానంలో డ్యాన్స్ చేశాడు. చెన్నై జట్టును ఛాంపియన్‌గా నిలిపిన జడేజాకు జట్టు మొత్తం సెల్యూట్ చేసింది. విజయం తర్వాత జడేజా, చెన్నై జట్టు(Chennai Team)తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న అజయ్ మండల్(Ajay Mandal)కు ప్రత్యేక బహుమతిని అందించి CSK అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.
చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఒక బౌండరీ బాదిన జడేజా.. తన బ్యాట్‌ను అజయ్ మండల్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని అజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జడేజా బహుమతిగా ఇచ్చిన బ్యాట్ ఫోటోను పోస్ట్ చేస్తూ, ఫైనల్ మ్యాచ్ చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసిన బ్యాట్‌ను రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తనకు బహుమతిగా ఇచ్చాడని అజయ్ రాశాడు. తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చినందుకు జడేజాకు కృతజ్ఞతలు తెలిపాడు. జడేజాతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడానికి అనుమతించినందుకు చెన్నై ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపాడు.
అజయ్ మండల్ మధ్యప్రదేశ్‌లో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్ తరపున ఆడుతున్నాడు. అజయ్ ఆల్ రౌండర్. అతను ఎడమచేతి వాటం స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. చెన్నై ఈ సీజన్‌లో అజయ్‌ను రూ.20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్‌లో అజయ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయలేదు. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.