Maidaan Teaser: మరో స్పోర్ట్స్ డ్రామా వచ్చేస్తోంది.. అజయ్ దేవ్‌గన్ మైదాన్ టీజర్ రిలీజ్
Maidaan Teaser: మరో స్పోర్ట్స్ డ్రామా వచ్చేస్తోంది. అజయ్ దేవ్‌గన్ ఫుట్‌బాల్ కోచ్‌గా నటించిన మైదాన్ టీజర్ రిలీజ్ అయింది. ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే ఓ లెజెండ్ నిజ జీవిత స్టోరీ ఇది.
Maidaan Teaser: స్పోర్ట్స్ డ్రామాలు అభిమానులను ఎంతగానో అలరిస్తాయి. హిందీతోపాటు తెలుగులోనూ ఇప్పటికే క్రికెట్, హాకీ, కబడ్డీలాంటి ఆటలపై ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు తెరకెక్కి సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు అలాంటిదే మరో స్పోర్ట్స్ డ్రామా రాబోతోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్ ఫుట్‌బాల్ కోచ్ గా కనిపిస్తున్న ఈ మూవీ పేరు మైదాన్.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా గురువారం (మార్చి 30) ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే సయ్యద్ అబ్దుల్ రహీమ్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ నటించిన భోలా మూవీ శుక్రవారం (మార్చి 31) రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు అతని మరో మూవీ మైదాన్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లాగే ఈ మైదాన్ టీజర్ కూడా అద్భుతంగా ఉందని చెప్పాలి. క్రికెట్ తోపాటు హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్ లాంటి ఆటల్లో ఇండియా సత్తా చాటుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ లో మాత్రం ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉంది. అయితే అలాంటి ఆటలోనూ పదేళ్లు ఇండియాకు స్వర్ణయుగంలా నిలిచింది.
1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్‌బాల్ లోనూ ఇండియా సత్తా చాటింది. దాని కారణం ఈ సయ్యద్ అబ్దుల్ రహీమ్. అజయ్ దేవ్‌గన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అతని జీవిత చరిత్రను మైదాన్ రూపంలో తీసుకురాబోతున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఈ ఆట ఆడటానికి కనీసం బూట్లు కూడా లేని స్థితి నుంచి ఆ పదేళ్లలో ఆ ఆటను శాసించే స్థాయికి ఎలా వెళ్లిందన్నదే ఈ మైదాన్ స్టోరీ.
అందుకు తగినట్లే ఈ టీజర్ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈ మైదాన్ జూన్ 23న రిలీజ్ కానుంది. ఈ మూవీని అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్ట్ చేయగా.. బోనీ కపూర్ నిర్మించాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ మైదాన్ రిలీజ్ కానుంది. తన కెరీర్లో చేసిన అత్యుత్తమ సినిమాల్లో ఇదీ ఒకటని అజయ్ దేవ్‌గన్ అన్నాడు.