Rafael Nadal: 14సార్లు ఛాంపియన్.. తొలి రౌండ్‌లోనే ఓడిపోాయాడు.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నదాల్ ఔట్
28 May 2024, 8:34 IST
- Rafael Nadal: ఫ్రెంచ్ ఓపెన్‌ను 14సార్లు గెలిచిన రఫేల్ నదాల్ ఈసారి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ఊహించినట్లే నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతుల్లో అతడు ఓడిపోయాడు.
14సార్లు ఛాంపియన్.. తొలి రౌండ్‌లోనే ఓడిపోాయాడు.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి నదాల్ ఔట్
Rafael Nadal: ఫ్రెంచ్ ఓపెన్ ను 14సార్లు గెలిచి మట్టికోట మహారాజుగా పేరుగాంచిన స్పెయిన్ బుల్ రఫేల్ నదాల్ కు ఈసారి తీవ్రమైన నిరాశ తప్పలేదు. అంతటి ఛాంపియన్ ప్లేయర్ తొలి రౌండ్ కూడా దాటలేకపోయాడు. రోలాండ్ గారోస్ లో సోమవారం (మే 27) జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ 4 ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతుల్లో వరుస సెట్లలో ఓడిపోయాడు.
నదాల్ శకం ముగిసినట్లే..
ఒకటి, రెండు కాదు.. ఏకంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన ఘనత నదాల్ సొంతం. ఛాంపియన్ ప్లేయర్స్ కూడా ఎర్రమట్టిపై ఆడాలంటేనే భయపడతారు. అలాంటిది నదాల్ మాత్రం అదే క్లేకోర్టును తన కోటగా మార్చుకున్నాడు. గత 20 ఏళ్లుగా అక్కడ నదాల్ కు తిరుగులేదు. కానీ వరుస గాయాలు, కెరీర్ ముగింపు దశలో ఉన్న ఈ స్పెయిన్ బుల్ జోరు పూర్తిగా తగ్గింది.
తన ఫేవరెట్ ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఓటమి అదే చెబుతోంది. జ్వెరెవ్ చేతుల్లో నదాల్ 3-6, 6-7. 3-6తో వరుసగా సెట్లలో ఓడిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో నదాల్ ఓడిపోవడం ఇది కేవలం నాలుగోసారి మాత్రమే. దీంతో ఎర్రమట్టిపై నదాల్ ను ఓడించిన సోడర్లింగ్, జోకొవిచ్ లాంటి వాళ్ల సరసన జ్వెరెవ్ నిలిచాడు. తొలి రౌండ్ మ్యాచ్ ప్రారంభం కాగానే రఫా.. రఫా.. అనే ప్రేక్షకుల నినాదాలతో రోలాండ్ గారోస్ మార్మోగిపోయింది.
వరుస సెట్లలో ఓటమి
అయితే వాళ్ల అరుపులకు చెక్ పెట్టడానికి జ్వెరెవ్ కు పెద్దగా టైమ్ పట్టలేదు. తొలి సెట్ ను సులువుగా 6-3తో గెలిచాడు. తొలి సెట ఓడినా నదాల్ మళ్లీ పుంజుకుంటాడని ఫ్యాన్స్ ఆశతో ఎదురు చూశారు. అందుకు తగినట్లే రెండో సెట్ లో అతడు గట్టి పోటీ ఇచ్చాడు. 6-6తో ఇద్దరూ సమం కాగా.. టై బ్రేకర్ లో గెలిచి రెండో సెట్ ను కూడా 7-6తో జ్వెరెవ్ ఎగరేసుకుపోయాడు.
మూడో సెట్ లో జ్వెరెవ్ మరోసారి చెలరేగాడు. ఐదో గేమ్ లో నదాల్ సర్వీస్ ను 13 నిమిషాల పాటు పోరాడి బ్రేక్ చేశాడు. ఆ తర్వాత మరో బ్రేక్ పాయింట్ సాధించి 6-3తో మూడో సెట్ తోపాటు మ్యాచ్ కూడా గెలిచాడు. మొత్తంగా 18 బ్రేక్ పాయింట్స్ అవకాశాలు రాగా.. వాటిలో ఆరింటిలో జ్వెరెవ్ సక్సెస్ అయ్యాడు.
ఫ్రెంచ్ ఓపెన్ ఇదే చివరిసారా?
నదాల్ తన చివరి ఫ్రెంచ్ ఓపెన్ ఆడేశాడా? ఇప్పుడిదే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. వరుస గాయాలతో సతమతమవుతున్న ఈ స్టార్ ప్లేయర్.. వచ్చే ఏడాది తిరిగి రావడం అనుమానమే. గతేడాది జనవరి నుంచి పొట్ట భాగంలో గాయాలతో నదాల్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచాడతడు. జోకొవిచ్ (24) తర్వాత అత్యధిక టైటిల్స్ అతనివే. ఫెదరర్ 20 టైటిల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు.
అయితే తాను చివరి ఫ్రెంచ్ ఓపెన్ ఆడేశానా లేదా అన్నది నదాల్ చెప్పలేదు. కానీ వచ్చే వింబుల్డన్ మాత్రం అతడు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. గత రెండు నెలల కిందటితో పోలిస్తే తన శరీరం బాగా స్పందిస్తోందని, మరో రెండు నెలల్లో తాను రిటైర్మెంట్ అనౌన్స్ చేసినా చేయొచ్చని అన్నాడు. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు.