Tennis Courts | టెన్నిస్‌లో గ్రాస్‌, క్లే, హార్డ్‌ కోర్టుల మధ్య తేడా ఏంటి?-do you know what are the differences among clay grass and hard courts in tennis ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Do You Know What Are The Differences Among Clay Grass And Hard Courts In Tennis

Tennis Courts | టెన్నిస్‌లో గ్రాస్‌, క్లే, హార్డ్‌ కోర్టుల మధ్య తేడా ఏంటి?

Hari Prasad S HT Telugu
Dec 22, 2021 04:24 PM IST

Tennis Courts.. టెన్నిస్ కోర్టుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ కారణంగానే టెన్నిస్‌లో అత్యుత్తమ ప్లేయర్స్‌ జాబితాలో ఉండే కొందరు కొన్ని కోర్టులపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఫెదరర్‌ కంటే ముందు 14 గ్రాండ్‌స్లామ్స్‌ టైటిల్స్‌తో టాప్‌లో ఉన్న పీట్‌ సంప్రాస్‌.. తన కెరీర్‌లో ఒక్క ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా గెలవలేదు.

యూఎస్ ఓపెన్ ఆడే హార్ట్ కోర్టు ఇదే
యూఎస్ ఓపెన్ ఆడే హార్ట్ కోర్టు ఇదే (AFP)

Tennis Court.. టెన్నిస్‌లో వివిధ రకాల కోర్టులు ఉంటాయన్న విషయం తెలుసు కదా. ఈ గేమ్‌లో అత్యున్నతంగా భావించే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలను మూడు కోర్టులపై ఆడతారు. అవి గ్రాస్‌, క్లే, హార్డ్‌ కోర్టులు. ఈ కోర్టుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ కారణంగానే టెన్నిస్‌లో అత్యుత్తమ ప్లేయర్స్‌ జాబితాలో ఉండే కొందరు కొన్ని కోర్టులపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఫెదరర్‌ కంటే ముందు 14 గ్రాండ్‌స్లామ్స్‌ టైటిల్స్‌తో టాప్‌లో ఉన్న పీట్‌ సంప్రాస్‌.. తన కెరీర్‌లో ఒక్క ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా గెలవలేదు. 

కారణం ఇది క్లే కోర్టుపై ఆడే గ్రాండ్‌స్లామ్‌. ఇదే క్లే కోర్టులో స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నడాల్‌ కింగ్‌. కెరీర్‌లోని 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో 10 ఈ క్లే కోర్టుపై సాధించినవే. అదే సమయంలో ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడైన రోజర్‌ ఫెదరర్‌ గ్రాస్‌ కోర్ట్‌ అంటే చెలరేగుతాడు. మరి ఇలా ఎందుకు? ఈ కోర్టుల మధ్య ఉన్న తేడా ఏంటి? ఏ కోర్టు ఎలా ఉంటుంది? ఏ కోర్టు ఎలాంటి ప్లేయర్స్‌కు కలిసి వస్తుంది అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

గ్రాస్‌కోర్టులు

పేరులో ఉన్నట్లే పచ్చిక ఉండే కోర్టు ఇది. గ్రాండ్‌స్లామ్స్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ ఆడేది ఈ గ్రాస్‌కోర్టులపైనే. అన్ని కోర్టుల కంటే వేగవంతమైన కోర్టుగా ఈ గ్రాస్‌కోర్టుకు పేరుంది. ఈ కోర్టుపై బౌన్స్‌ తక్కువగా ఉంటుంది. పైగా పచ్చికపై పడిన బంతి జారుతుంది. ఈ కోర్టులపై సుదీర్ఘ ర్యాలీలు ఉండవు. సర్వ్‌ అండ్‌ వాలీని నమ్ముకునే ప్లేయర్స్‌ ఈ గ్రాస్‌కోర్టులపై రాణిస్తారు. పీట్‌ సంప్రాస్‌, రోజర్‌ ఫెదరర్, జాన్‌ మెకన్రోలాంటి ప్లేయర్స్‌ గ్రాస్‌ కోర్టును ఏలారు.

హార్డ్‌ కోర్టులు

ఈ కోర్టులను తారు లేదా కాంక్రీటుతో తయారు చేస్తారు. ప్రపంచంలో ఎక్కువగా అందుబాటులో ఉండే కోర్టులు ఇవే. వీటి నిర్వహణ కూడా సులభం కావడంతో చాలా టెన్నిస్‌ క్లబ్‌లలో ఈ కోర్టులే కనిపిస్తాయి. ప్రముఖ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలైన యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఈ హార్డ్‌కోర్టులపైనే జరుగుతాయి. యూఎస్‌ ఓపెన్‌లో సింథటిక్ హార్డ్‌ కోర్టు, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అక్రిలిక్‌ హార్ట్‌ కోర్టు వాడతారు. ఈ కోర్టుపై బంతి క్లే కోర్టు కంటే వేగంగా, గ్రాస్‌ కోర్టు కంటే కాస్త నెమ్మదిగా కదులుతుంది.

ఉపరితలం చాలా గట్టిగా ఉండటం వల్ల బౌన్స్ అన్ని కోర్టుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కోర్టు అందరి ప్లేయర్స్‌కు సమంగా కలిసి వస్తుంది. అన్ని కోర్టుల్లో ఇదే బెస్ట్‌ అని ఇంటర్నేషనల్ టెన్నిస్‌ ఫెడరేషన్‌ కూడా సర్టిఫికెట్‌ ఇచ్చింది. సర్వ్‌ అండ్‌ వాలీ ప్లేయర్‌ అయినా, బేస్‌లైన్‌ ప్లేయర్‌ అయినా అందరికీ సమంగా ఈ హార్డ్‌ కోర్టు కలిసి వస్తుంది.

క్లే కోర్టులు

ఇవి ఎర్ర మట్టి కోర్టులు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడేది ఈ క్లే కోర్టులపైనే. అన్ని టెన్నిస్‌ కోర్టుల కంటే నెమ్మదైనదిగా ఈ క్లే కోర్టుకు పేరుంది. మట్టి బంతి వేగాన్ని తగ్గిస్తుంది. గ్రాస్‌ కోర్టు కంటే కాస్త ఎక్కువ బౌన్స్‌ ఉంటుంది. దీంతో సుదీర్ఘ ర్యాలీలను ఈ కోర్టులపై చూడొచ్చు. 

సర్వ్‌ మంచిగా ఉన్న ప్లేయర్స్‌కు గ్రాస్‌, హార్డ్‌ కోర్టులు కలిసి వచ్చినా.. క్లే కోర్టు బంతి వేగాన్ని తగ్గించడం వల్ల ప్రత్యర్థి సులువుగా సర్వ్‌ను రిటర్న్‌ చేయగలరు. దీంతో సంప్రాస్‌, ఫెదరర్‌లాంటి సర్వ్‌ అండ్‌ వాలీ ప్లేయర్స్‌ ప్రభావం క్లే కోర్టుపై చాలా తక్కువ. బేస్‌లైన్‌ ప్లేయర్స్‌, తమ షాట్లలో బంతిని ఎక్కువగా స్పిన్‌ చేయగలిగిన ప్లేయర్స్‌ ఈ కోర్టుపై రాణించగలరు. 1990ల్లో మైకేల్‌ చాంగ్‌, సమకాలీన టెన్నిస్‌లో రఫేల్‌ నడాల్‌ క్లే కోర్టు కింగ్‌గా పేరుగాంచారు.

 

WhatsApp channel

సంబంధిత కథనం